గుడ్డివాడివైతే మాకేంటి.. ఇవన్నీ అవసరమా?

JNU Visually Challenged Student Shares Bitter Experience By Delhi Police - Sakshi

అంధ విద్యార్థిపై పోలీసుల జులుం

న్యూఢిల్లీ : ‘నూతన విద్యావిధానం పేరిట దేశంలోని వివిధ కాలేజీల్లో ఫీజుల పెంపుపై 22 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. నిన్న శాంతియుతంగా పార్లమెంటును ముట్టడించేందుకు సిద్ధమయ్యాం. అయితే పోలీసులు మా పట్ల అమానుషంగా ప్రవర్తించారు. జోర్ భాగ్‌లో మాపై లాఠీలతో విరుచుకుపడ్డారు. మేమంతా పారిపోయేందుకు ప్రయత్నించాం. అయితే ఓ పోలీసు నన్ను పట్టుకుని కొడుతుంటే.. నా సహ విద్యార్థులు మానవహారంగా నిలబడి నన్ను రక్షించాలని భావించారు. నేను అంధుడినని వారికి చెప్పారు. అయినా అతడు వినకుండా వాళ్లందరినీ చెదరగొట్టి నన్ను కొట్టాడు. గుడ్డివాడు అయితే నిరసనల్లో పాల్గొనడం ఎందుకు హేళన చేస్తూ ఇష్టారీతిన లాఠీచార్జీ చేశాడు. ఆ తర్వాత మరికొంత మంది పోలీసులు వచ్చి నన్ను కొట్టారు. నా గుండెలపై, పొట్టపై, గొంతు మీద బూట్లతో తొక్కుతూ హింసించారు. ఎత్తి కిందపడేశారు. పారిపో అని చెప్పారు. దీంతో ఎలాగోలా శక్తి కూడదీసుకుని పరిగెడుతుంటే వెనుక నుంచి కాళ్లపై కొడుతూ మళ్లీ కిందపడేశారు’ అంటూ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన అంధ విద్యార్థి శశి భూషణ్‌ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా హాస్టల్‌ ఫీజుల పెంపును నిరసిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిపై లాఠీచార్జీ చేశారు. విద్యార్థుల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారు. పోలీసులు జరిపిన లాఠీ చార్జ్‌లో పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో శశి భూషణ్‌ వంటి అంధ విద్యార్థులు కూడా ఉండటం గమనార్హం. ఇక శశి భూషణ్‌ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును జేఎన్‌యూ అంధ విద్యార్థుల సంఘం తీవ్రంగా ఖండించింది. ’శశి అంధ విద్యార్థి అని తెలిసిన తర్వాత కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. గుడ్డివాడివైతే నీకు ధర్నాలు ఎందుకు అంటూ అతడిని మానసిక వేదనకు గురిచేశారు అని ఆవేదన వ్యక్తం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top