ఈ చిచ్చు ఎప్పటికి చల్లారేనో! | Jat Quota reservation Protest in Haryana | Sakshi
Sakshi News home page

ఈ చిచ్చు ఎప్పటికి చల్లారేనో!

Feb 20 2016 5:31 PM | Updated on Sep 3 2017 6:03 PM

ఈ చిచ్చు ఎప్పటికి చల్లారేనో!

ఈ చిచ్చు ఎప్పటికి చల్లారేనో!

ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో జాట్‌లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మక రూపం ధరించడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.

న్యూఢిల్లీ: ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో జాట్‌లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మక రూపం ధరించడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వెనకబడిన తరగుతుల కమిషన్ వ్యతిరేకించినా, సుప్రీంకోర్టు ఇంతకాలం కాదన్నా లెక్క చేయకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలోనే చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. దేశంలో మొదటి నుంచి జాట్‌ల రిజర్వేషన్ల సమస్య హింస, రాజకీయ అవకాశవాదం అన్న చట్రంలోనే తిరుగుతోంది.

చరిత్రలోకి వెళితే, 1999లో రాజస్థాన్‌లో ఆందోళన చేస్తున్న జాట్‌లకు ఓబీసీ హోదా కల్పిస్తామంటూ అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు అమలు చేశారు. దాంతో ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజస్థాన్ నుంచి మెజారిటీ సీట్లు లభించాయి. 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందే ఇతర రాష్ట్రాల్లోని జాట్‌లు కూడా తమనూ ఓబీసీ కేటగిరిగా గుర్తించాలంటూ నినదించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు జాట్‌లకు అనుకూలంగా హామీలు ఇచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలేవీ వారి డిమాండ్‌ను అమలు చేయలేక పోయాయి. పలు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఆందోళనలు జరుగుతూనే వస్తున్నాయి.

చౌదరి యశ్పాల్ మాలిక్ నాయకత్వంలోని ‘అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్శ్ సమితి’  ఆధ్వర్యాన 2008 నుంచి ఆందోళనలు తీవ్రమయ్యాయి. వాటిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైలు రోకో, బంద్‌లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లాంటి సంఘటనలు 2014 వరకు కొనసాగుతూనే వచ్చాయి. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో జాట్‌లను ఓబీసీలో చేరుస్తామంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ ఇందుకు వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

2014లోనే వచ్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం జాట్లకు మద్దతుగా సుప్రీం కోర్టులో వాదించింది. జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించాలంటూ సుప్రీం కోర్టు రిజర్వేషన్ ఉత్తర్వులపై స్టే జారీ చేసింది. ఎన్నికల అనంతరం హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడడంతో అప్పటి నుంచి జాట్లు మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తే తప్ప ప్రభుత్వం లొంగిరాదని భావించిన ఆందోళనకారులు విధ్వంసం, హింసకు పాల్పడ్డారు. ఈ విధ్వంసంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. వారు భావించినట్లే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. సంబంధిత బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు వర్తించవన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మిగతా రాష్ట్రాల జాట్లు కూడా ఇదే బాటను అనుసరించవచ్చు. తమనూ ఓబీసీలో చేర్చాలంటూ మరో ఆదిపత్య కులం కూడా ముందుకు రావచ్చు. ఇప్పటికే గుజరాత్‌లో పటేళ్ల ఆందోళన కొనసాగుతున్న విషయం తెల్సిందే.  

జాట్లు నిజంగా వెనకబడ్డారా ?
హర్యానా, ఉత్తరప్రదేశ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్ల కమ్యూనిటీ చాలా బలమైనది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు ఇతర కులాలకన్నా ముందే ఉన్నారు. అయినా వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? పట్టణీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల యజమానులుగా కొనసాగుతున్న పాతతరం జాట్లకు పట్టణాల్లో చదువుతున్న ఈ తరం జాట్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఏర్పడింది. ఈ తరం జాట్లు వ్యవసాయంపై ఆధారపడి జీవించాలనుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. మొదటి నుంచి జాట్లు చదువుకు అంత ప్రాధన్యత ఇవ్వకపోవడంతో వారిలో మెరిట్ కూడా తక్కువే. రిజర్వేషన్లు వస్తే తప్ప ఉద్యోగాలు రావన్న అభద్రతా భావం వారిలో నెలకొంది. అందుకే ఆందోళన బాట పట్టారు.

ఆందోళనల్లో హింసాత్మక ధోరణి చెలరేగినంత కాలం, రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను వదలనంత కాలం ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. సామాజిక పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకొని, రాజ్యాంగం పరిధిలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరిస్తేగానీ ఈ నిప్పు చల్లారదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement