breaking news
Jat Quota
-
యూపీలో ఆట మొదలుపెట్టిన బీజేపీ
మొదటి దశలో ఎన్నికలు జరుగనున్న పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ తనశైలి ఆటను మొదలుపెట్టింది. పార్టీ కింగ్‌పిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన మార్కును చాటేలా పశ్చిమ యూపీలో బలంగా ఉన్న జాట్లను తమవైపు తిప్పుకునే వ్యూహాలకు పదునుపెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జాట్లలో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి, వారిని మచ్చిక చేసుకునేలా బుధవారం 200 మంది జాట్ ప్రతినిధులతో జరిపి భేటీ పార్టీకి కలిసొస్తుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. సమాజ్‌వాదీ పార్టీ–రాష్ట్రీయ్ లోక్ దళ్ కూటమిని విచ్ఛిన్నం చేసి జాట్ ఓట్లను చీల్చేలా ఇప్పటికే క్షేత్ర స్థాయి కార్యాచరణను షురూ చేసింది. కూటమి ఓట్లు చీల్చే ఎత్తుగడ.. పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న 58 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో ప్రధానంగా షామ్లీ, ముజఫర్‌నగర్, భాగ్‌పత్, మీరట్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధనగర్, బులంద్ షహర్ వంటి జిల్లాలోని కనీసంగా 30 నియోజకవర్గాల్లో జాట్లే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. 3.5 శాతంగా ఉన్న జాట్లకు స్థానిక రైతుల్లో మంచి సాన్నిహిత్యం ఉంది. నిజానికి ముస్లిం–జాట్‌లో పరస్పరం సోదరభావంతో మెలిగినప్పటికీ 2013 ముజఫర్‌గనర్ అల్లర్ల తర్వాత వారి చెలిమి చెడి ఎవరికి వారయ్యారు. ఈ కారణంగా 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆర్ఎల్డీ ఒక్క సీటును గెలుచుకోలేకపోయింది. 2017 అసెంబ్లీలోనూ కేవలం ఒక్క సీటుకే పరిమితమయింది. ముజఫర్‌నగర్ అల్లర్లను ప్రచారంలో పెట్టి గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేలా వ్యూహాలు సిధ్ధం చేసినప్పటికీ వాటిని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ చిత్తు చేశారు. ఇటీవలి రైతు ఉద్యమాలను అడ్డుగా పెట్టి ముస్లిం–జాట్ల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచారు. గత ఏడాదిలో పరివర్తన్ సందేశ్ ర్యాలీల ద్వారా సోదరభావాన్ని పునర్నిర్మించే యత్నాలు చేశారు. అనంతరం ముస్లిం–జాట్–యాదవ్ ఫార్మాలాను తెరపైకి తెచ్చి ఆర్ఎల్డీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ పార్టీకి ఏకంగా 33 స్థానాలను కేటాయించారు. ఈ వ్యూహంతోనే తొలి దశలో కనీసంగా 40–50 స్థానాలు కొల్లగొట్టే యత్నాల్లో ఉన్నారు. ఎస్పీ వ్యూహాలను తిప్పకొట్టేలా బీజేపీ సైతం అనేక ఎత్తుగడలు వేస్తోంది. రైతు చట్టాలను వెనక్కి తీసుకోవడం ద్వారా జాట్లు, రైతుల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర మంత్రి మండలిలలో ముగ్గురు జాట్ నేతలు భూపేంద్రసింగ్, లక్ష్మీనారాయణ్సింగ్, బుల్దేవ్ సింగ్‌లకు అవకాశం కల్పించింది. దీనికి తోడు ముజఫర్‌నగర్‌లో ఆర్ఎల్డీ మాజీ నేత అజిత్‌సింగ్‌ను ఓడించిన జాట్ నేత సంజీవ్ బలియాన్‌ను కేంద్రమంత్రిని చేసింది. జాట్ రాజు రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్ పేరుతో ఓ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసింది. ఇవన్నీ కేవలం జాట్లను సంతోషపరిచేందుకే అని వేరుగా చెప్పనక్కర్లేదు. షా రంగంలోకి.. జాట్లలో చీలిక! 2017 ఎన్నికల్లో బీజేపీ జాట్లకు 12 స్థానాలను కేటాయించగా... ఈసారి అదే స్థాయి సీట్లను కేటాయించింది. అయితే ఎస్పీ–ఆర్ఎల్డీ కూటమితో తమకు నష్టం జరుగకుండా ఉండేందుకు జాట్లను చీల్చే ప్రయత్నాలకు దిగింది. దీనిలో భాగంగా అఖిలే‹Ô హయాంలో జరిగిన ముజఫర్‌నగర్ అల్లర్లను పదేపదే ప్రస్తావిస్తూ కూటమిది అపవిత్ర బంధం అంటూ ప్రచారం చేస్తోంది. ఆర్ఎల్డీ పొత్తుతో జాట్లే తీవ్రంగా నష్టపోయారని, ముస్లిం అభ్యర్థులు లబ్ధిపొందుతున్నారని ఆరోపణలు చేస్తోంది. ఇది కొంతమేర ప్రభావం చూపించి, ఎస్పీ అభ్యర్థులు ఉన్న చోట జాట్ల ఓట్లు గంపగుత్తగా వారికే వెళ్లకుండా చేస్తోంది. దీనికి మరింత పదునుపెట్టి జాట్లను పూర్తిగా తనవైపు తిప్పుకునేలా బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో పశ్చిమ యూపీకి చెందిన 200ల మంది జాట్ ప్రతినిధులతో ‘సామాజిక సోదరుల భేటీ’ని నిర్వహించారు. తమ ప్రభుత్వం ముగ్గురు జాట్లను గవర్నర్లుగా నియమిస్తే, మరో 9 మందిని లోక్‌సభకు పంపిందనే విషయాన్ని అమిత్ షా భేటీలో గుర్తుచేశారు. జాట్ల సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చిన అమిత్ షా, ఏదైనా ప్రత్యేకంగా మాట్లాడటానికి నేరుగా తన ఇంటికే రావాలని, తన ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో ‘యూపీ రైతులకు రూ.36వేల కోట్ల రుణాలను రద్దు చేసింది. 1.30లక్షల కోట్లను రైతుల ఖాతాలో జమచేసింది. 1.48లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లించింది. రైతులకు చేయాల్సిందంతా చేస్తోంది’ అని గుర్తుచేశారు. రైతులకు, జాట్లకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న హామీ ద్వారా జాట్లు బీజేపీకి దూరమయ్యారన్న నిందను దూరం చేసే ప్రయత్నం చేశారు. ఈ భేటీలో పాల్గొన్న జాట్ నేతలు జై శ్రీరామ్, ప్రధాని నరేంద్ర మోదీ జిందాబాద్, అమిత్ షా జిందాబాద్ అని నినాదాలు చేయడం ద్వారా బీజేపీతో నడిచేందుకు వారికెలాంటి అభ్యంతరాలు లేవని చాటిచెప్పారని బీజేపీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. జాట్లతో భేటీ జరిగిన కొన్ని గంటల్లోనే అమిత్‌షా గురువారం పశ్చిమ యూపీలోని మధుర, గౌతమ్బుద్ధనగర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇదే రోజున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నా«థ్‌సింగ్ భాగ్‌పట్, çఘజియాబాద్‌లలో పార్టీ ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ చర్యలన్నీ జాట్ల ఓట్లను చీల్చడంతో పాటు 20–30 స్థానాల్లో గెలుపును నిర్ణయిస్తుందని స్థానిక నేతలు విశ్లేషిస్తున్నారు. – న్యూఢిల్లీ, సాక్షి -
ఈ చిచ్చు ఎప్పటికి చల్లారేనో!
న్యూఢిల్లీ: ఓబీసీ కోటాలో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో జాట్లు ప్రారంభించిన ఆందోళన హింసాత్మక రూపం ధరించడంతో అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వెనకబడిన తరగుతుల కమిషన్ వ్యతిరేకించినా, సుప్రీంకోర్టు ఇంతకాలం కాదన్నా లెక్క చేయకుండా రిజర్వేషన్లు కల్పిస్తూ త్వరలోనే చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది. దేశంలో మొదటి నుంచి జాట్ల రిజర్వేషన్ల సమస్య హింస, రాజకీయ అవకాశవాదం అన్న చట్రంలోనే తిరుగుతోంది. చరిత్రలోకి వెళితే, 1999లో రాజస్థాన్‌లో ఆందోళన చేస్తున్న జాట్లకు ఓబీసీ హోదా కల్పిస్తామంటూ అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజపేయి హామీ ఇచ్చారు. రిజర్వేషన్లు అమలు చేశారు. దాంతో ఆ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రాజస్థాన్ నుంచి మెజారిటీ సీట్లు లభించాయి. 2004లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందే ఇతర రాష్ట్రాల్లోని జాట్లు కూడా తమనూ ఓబీసీ కేటగిరిగా గుర్తించాలంటూ నినదించారు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు జాట్లకు అనుకూలంగా హామీలు ఇచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీలేవీ వారి డిమాండ్‌ను అమలు చేయలేక పోయాయి. పలు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు, అక్కడక్కడ ఆందోళనలు జరుగుతూనే వస్తున్నాయి. చౌదరి యశ్పాల్ మాలిక్ నాయకత్వంలోని ‘అఖిల భారతీయ జాట్ ఆరక్షణ్ సంఘర్శ్ సమితి’ ఆధ్వర్యాన 2008 నుంచి ఆందోళనలు తీవ్రమయ్యాయి. వాటిలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. రైలు రోకో, బంద్‌లు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం లాంటి సంఘటనలు 2014 వరకు కొనసాగుతూనే వచ్చాయి. 2014 పార్లమెంట్ ఎన్నికలకు ముందు దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో జాట్లను ఓబీసీలో చేరుస్తామంటూ అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ ఇందుకు వ్యతిరేకించినా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై సుప్రీం కోర్టు స్టే విధించింది. 2014లోనే వచ్చిన హర్యానా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అప్పుడే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం జాట్లకు మద్దతుగా సుప్రీం కోర్టులో వాదించింది. జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించాలంటూ సుప్రీం కోర్టు రిజర్వేషన్ ఉత్తర్వులపై స్టే జారీ చేసింది. ఎన్నికల అనంతరం హర్యానాలో కూడా బీజేపీ ప్రభుత్వమే ఏర్పడడంతో అప్పటి నుంచి జాట్లు మళ్లీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. విధ్వంసం సృష్టిస్తే తప్ప ప్రభుత్వం లొంగిరాదని భావించిన ఆందోళనకారులు విధ్వంసం, హింసకు పాల్పడ్డారు. ఈ విధ్వంసంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. వారు భావించినట్లే రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. సంబంధిత బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదిస్తే సుప్రీం కోర్టు స్టే ఉత్తర్వులు వర్తించవన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మిగతా రాష్ట్రాల జాట్లు కూడా ఇదే బాటను అనుసరించవచ్చు. తమనూ ఓబీసీలో చేర్చాలంటూ మరో ఆదిపత్య కులం కూడా ముందుకు రావచ్చు. ఇప్పటికే గుజరాత్లో పటేళ్ల ఆందోళన కొనసాగుతున్న విషయం తెల్సిందే. జాట్లు నిజంగా వెనకబడ్డారా ? హర్యానా, ఉత్తరప్రదేశ్‌లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో జాట్ల కమ్యూనిటీ చాలా బలమైనది. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వారు ఇతర కులాలకన్నా ముందే ఉన్నారు. అయినా వారు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? పట్టణీకరణ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల యజమానులుగా కొనసాగుతున్న పాతతరం జాట్లకు పట్టణాల్లో చదువుతున్న ఈ తరం జాట్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఏర్పడింది. ఈ తరం జాట్లు వ్యవసాయంపై ఆధారపడి జీవించాలనుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడాలని కోరుకుంటున్నారు. మొదటి నుంచి జాట్లు చదువుకు అంత ప్రాధన్యత ఇవ్వకపోవడంతో వారిలో మెరిట్ కూడా తక్కువే. రిజర్వేషన్లు వస్తే తప్ప ఉద్యోగాలు రావన్న అభద్రతా భావం వారిలో నెలకొంది. అందుకే ఆందోళన బాట పట్టారు. ఆందోళనల్లో హింసాత్మక ధోరణి చెలరేగినంత కాలం, రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలను వదలనంత కాలం ఈ చక్రం ఇలాగే తిరుగుతూ ఉంటుంది. సామాజిక పరిస్థితులను ప్రాతిపదికగా తీసుకొని, రాజ్యాంగం పరిధిలో రిజర్వేషన్ల సమస్యను పరిష్కరిస్తేగానీ ఈ నిప్పు చల్లారదు.