‘ఈ తరహా దాడులను నివారించడం కష్టమే’ | Intelligence Said We Expect Ciria Type Car Bomb Attacks Over Pulwama Attack | Sakshi
Sakshi News home page

‘ఈ తరహా దాడులను నివారించడం కష్టమే’

Feb 15 2019 1:39 PM | Updated on Feb 15 2019 1:45 PM

Intelligence Said We Expect Ciria Type Car Bomb Attacks Over Pulwama Attack - Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌, పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 43 మందికి పైగా సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉగ్రవాది ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకుని భద్రతాబలగాల కాన్వాయ్‌లో ప్రవేశించాడు. అనంతరం తన కారును కాన్వాయ్‌లోని ఓ బస్సుకు ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు.

ఈ విషయం గురించి ఇంటిలిజెన్స్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ... ‘కొన్ని రోజుల ముందే ఈ తరహా దాడుల గురించి చర్చించాము. ఇలాంటి దాడులు ఎక్కువగా సిరియాలో జరుగుతుంటాయి. ముష్కరులు కూడా ఏదో ఒక రోజు మన దగ్గర ఇదే ప్రయోగాన్ని అమలు చేస్తారని భావించాం. కానీ అది ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. ఈ తరహా దాడులను ముందుగా గుర్తించడం, నివారించడం కాస్తా కష్టమైన పనే. ఎందుకంటే సాధరణంగా దాడులకు తెగబడే వారు ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే సమయాన్ని ఎంచుకుని విధ్వంసం సృష్టిస్తారు. ఇలాంటప్పుడు రోడ్డు మీద ఉన్న అన్ని వాహనాలను పూర్తిగా పరిశీలించడం కుదరదు. ఫలితంగా దాడులను నియంత్రించడం సాధ్యమయ్యే పని కాదు’ అన్నారు.

అయితే ‘ఈ సమస్య పరిష్కారానికి రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. జవాన్ల కాన్వాయ్‌లను ట్రాఫిక్‌ లేని సమయంలో అంటే రాత్రి పూట లేదా తెల్లవారుజామున తరలించాలి. అప్పుడు తక్కువ ట్రాఫిక్‌ ఉంటుంది కాబట్టి అన్ని వాహనాలను జాగ్రత్తగా పరీక్షించవచ్చు. లేదా.. భద్రతాబలగాల కాన్వాయ్‌ల తరలింపు పూర్తయ్యవరకే ఆయా మార్గాల్లో వాహనాలు తిరగకుండా రోడ్డును బ్లాక్‌ చేయాలి. ప్రస్తుతం ఉన్న పరిష్కారాలు ఇవే. వీటి గురించి మరింత లోతుగా చర్చించాలని భావిస్తోన్న నేపథ్యంలో ఈ దాడి జరగడం విచారకరమ’ని తెలిపారు.

అంతేకాక గతంలో సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి చేసేవారన్నారు. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారని తెలిపారు. కానీ ముష్కరులు కూడా కొత్త వ్యూహాలు పన్నుతున్నారని.. ప్రస్తుత దాడి జరిగిన తీరు చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement