ఉగ్ర నీడలను పసిగడుతూ పంజా..

Intelligence Inputs Drives Iaf On Balakot Air Strikes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నేలకొరిగిన నేపథ్యంలో పాకిస్తాన్‌లోని బాలకోట్‌లో జైషే మహ్మద్‌ ఉగ్ర శిబిరంపై భారత వైమానిక దళం జరిపిన దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి.

ఉగ్ర కదలికలపై ఆరా..
బాలకోట్‌లోని జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల శిబిరంలో నాలుగు భవనాల్లో సమావేశమైన టెర్రరిస్టుల సంఖ్యపై ఇంటెలిజెన్స్‌ వర్గాలు వివరాలు వెల్లడించాయి. దౌరా ఈ మౌలాత్‌ అనే భవనంలో 30 మంది టెర్రరిస్టులు సమావేశమయ్యారని, ఫిబ్రవరి 25న బాలకోట్‌లో ఉగ్రవాదులకు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైనట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక
దౌరా ఈ ఖాస్‌ అనే భవనంలో ఫిబ్రవరి 26న 91 మంది ఉగ్రవాదుల భేటీలో భారత్‌లో ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు 25 మంది ఉగ్రవాదులకు ఈ శిబిరంలో శిక్షణ కోసం ఎంపిక చేసినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాల సమాచారం. ఇక ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రదాడి అనంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఐదు రోజుల్లో ఫిబ్రవరి 19న తిరిగి బాలకోట్‌లోని ఉగ్ర స్ధావరానికి టెర్రరిస్టులు చేరుకున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాలు గుర్తించాయి.

ఇదే స్ధావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేందుకు 18 మంది సీనియర్‌ కమాండర్‌లను ఈ శిబిరానికి జైషే చీఫ్‌ పంపినట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాల పసిగట్టాయి. ఉగ్ర కదలికలపై అనుక్షణం నిఘా వేసి ఉగ్రవాదులకు భారీ నష్టం కలిగించేలా మెరుపు దాడులతో వైమానిక దళం ఫిబ్రవరి 26  తెల్లవారుజామున విరుచుకుపడింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top