రఫేల్ ఫైటర్ జెట్‌లో ద్రౌపదీ ముర్ము విహారం
రెండు వేర్వేరు ఫైటర్ జెట్లలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా రికార్డు
అంబాలా ఎయిర్‌బేస్ నుంచి 30 నిమిషాల పాటు ప్రయాణం∙
పైలట్‌గా వ్యవహరించిన గ్రూప్ కెపె్టన్ అమిత్ గెహానీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సర్వ సైన్యాధ్యక్షురాలు ద్రౌపదీ ముర్ము అరుదైన రికార్డు సృష్టించారు. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన రెండు వేర్వేరు రకాల యుద్ధ విమానాల్లో ప్రయాణించిన మొట్టమొదటి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. బుధవారం ఉదయం హరియాణాలోని అంబాలా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ద్రౌపదీ ముర్ము అత్యంత శక్తివంతమైన రఫేల్ యుద్ధవిమానంలో ప్రయాణించారు. 2023లో ఆమె సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానంలో ప్రయాణించిన విషయం తెలిసిందే.
గంటకు 700 కిలోమీటర్ల వేగంతో..
అంబాలా ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన రాష్ట్రపతి రఫేల్ పర్యటన 30 నిమిషాలపాటు కొనసాగింది. ఆమె పైలట్ సూట్, కళ్లద్దాలు ధరించారు. రాష్ట్రపతి ప్రయాణించిన యుద్ధ విమానం సముద్ర మట్టానికి సుమారు 15 వేల అడుగుల ఎత్తులో, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. రాష్ట్రపతి రఫేల్ ఫైటర్ జెట్‌లో దాదాపు 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, తిరిగి అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ విమానానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 17వ స్క్వాడ్రన్ ‘గోల్డెన్ ఆరోస్‘ కమాండింగ్ ఆఫీసర్, గ్రూప్ కెపె్టన్ అమిత్ గెహానీ పైలట్‌గా వ్యవహరించారు. 2020 జూలైలో ఫ్రాన్స్ నుంచి వచ్చిన రఫేల్ విమానాల మొదటి బ్యాచ్‌ను ఈ ‘గోల్డెన్ ఆరోస్‘ స్క్వాడ్రనే స్వీకరించింది. ‘ఆపరేషన్ సిందూర్‘లో ఈ స్క్వాడ్రన్ కీలక పాత్ర పోషించింది.
మర్చిపోలేని గొప్ప అనుభవం
ఈ చారిత్రక పర్యటన అనంతరం రాష్ట్రపతి ముర్ము సందర్శకుల పుస్తకంలో తన అనుభూతిని పంచుకున్నారు. ‘రఫేల్ యుద్ధ విమానంలో నా తొలి ప్రయాణం కోసం అంబాలా ఎయిర్‌బేస్‌ను సందర్శించడం ఆనందంగా ఉంది. ఇది నాకు మర్చిపో లేని గొప్ప అనుభవం. శక్తివంతమైన రఫేల్‌లో ఈ ప్రయాణం దేశ రక్షణ సామర్థ్యాలపై నాకు కొత్త నమ్మకాన్ని, గర్వాన్ని కలిగించింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన భారత వైమానిక దళాన్ని, అంబాలా ఎయిర్‌బేస్ బృందాన్ని అభినందిస్తున్నాను’’ అని పుస్తకంలో రాష్ట్రపతి రాశారు.
యుద్ధ విమానంలో మూడో రాష్ట్రపతి
యుద్ధ విమానంలో ప్రయాణించిన మూడో భారత రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము రికార్డుకెక్కారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలాం. ఆయన 2006 జూన్ 8న పుణెలో సుఖోయ్–30 ఎంకేఐ విమానంలో ప్రయాణించారు. ఆ తర్వాత 2009 నవంబర్ 25వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పుణెలో సుఖోయ్–30 ఎంకేఐలో ప్రయాణించి ఈ ఘనత సాధించిన తొలి మహిళా రాష్ట్రపతిగా నిలిచారు. అయితే, ద్రౌపదీ ముర్ము 2023 ఏప్రిల్ 8వ తేదీన అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి సుఖోయ్–30 ఎంకేఐలో, ఇప్పుడు అంబాలా నుంచి రఫేల్‌లో ప్రయాణించి.. రెండు వేర్వేరు రకాల ఫైటర్ జెట్లలో విహరించిన ఏకైక రాష్ట్రపతిగా విశిష్టమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
పాకిస్తాన్ పాలిట శివంగి
రఫేల్ పర్యటన సందర్భంగా అంబాలా ఎయిర్‌బేస్‌లో భారత వైమానిక దళం స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్ రాష్ట్రపతి ముర్మును కలిశారు. వారిద్దరి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్‌ను కూల్చివేశామని, పైలట్ శివాంగి సింగ్‌ను అదుపులోకి తీసుకున్నామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. అందులో ఏమాత్రం వాస్తవం లేదని భారత్ తేల్చిచెప్పింది. బుధవారం రాష్ట్రపతి ముర్ముతో శివాంగి సింగ్ ఫొటో బయటకు రావడంతో పాకిస్తాన్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. శివాంగి సింగ్ ఐఏఎఫ్ గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు మొట్టమొదటి, ఏకైక రఫేల్ మహిళా పైలట్‌గా రికార్డుకెక్కారు.
ఆపరేషన్ సిందూర్‌లో రఫేల్ ఫైటర్‌జెట్‌ను విజయవంతంగా నడిపించారు. కచి్చతత్వంతో కూడిన దాడులతో పాకిస్తాన్‌కు చుక్కలు చూపించారు. 29 ఏళ్ల శివాంగి సింగ్ వారణాసిలో జన్మించారు. 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మహిళా ఫైటర్ పైలట్‌గా రెండో బ్యాచ్‌లో శిక్షణ పొందారు. తొలుత ఎంఐజీ–21 బైసన్ యుద్ధ విమానం నడిపించారు. 2020లో రఫేల్ పైలట్‌గా అర్హత సాధించారు. ఈ నెల 9న క్వాలిఫైడ్ ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్(క్యూఎఫ్‌ఐ) బ్యాడ్జ్ సొంతం చేసుకున్నారు. యుద్ధ విమానాల సారథిగా ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన శివాంగి సింగ్‌ను ఎయిర్ మార్షల్ తేజ్‌బీర్ సింగ్ ఆనాడు ఘనంగా సత్కరించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆమె పేరు మార్మోగిపోయింది. ఆమె తప్పిపోయినట్లుగా ఓ వీడియో బయటకు వచి్చంది. అదంతా ఉత్తదేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.


