
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు సుప్రీం సీనియర్ జడ్జీలు గళమెత్తడాన్ని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సమర్ధించారు. సుప్రీం కోర్టు పనితీరుపై బాహాటంగా వ్యాఖ్యలు చేసిన న్యాయమూర్తులను విమర్శించే బదులు వారు లేవనెత్తిన అంశాలపై దృష్టిసారించాలన్నారు.
సర్వోన్నత న్యాయస్ధానం రాజీ పడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నలుగురు సీనియర్ జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించడం అసాధారణమేనన్నారు. దేశ ప్రయోజనాలకు విఘాతం కలుగుతున్న సమయంలో సాధారణ నియమాలు వర్తించవన్నారు.
తన ఉద్దేశంలో దేశానికి విశ్వాసంగా పనిచేయడమంటే ప్రభుత్వానికి చెంచాగిరి చేయడం కాదని వ్యాఖ్యానించారు. ఇక జడ్జి లోయా మృతిపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.