ఆ చెఫ్‌ని అరెస్ట్‌ చేయాలంటూ వందల మంది మహిళలు రోడ్లపైకి

Indian Origin Dubai Chef Under Fire Over Online Molestation Threat - Sakshi

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటనే అరెస్ట్‌ చేయాలని మహిళలు ఆందోళనకు దిగిన సంఘటనపై గల్ఫ్‌ న్యూస్‌ ఓ కథనం రాసింది. ఇందులో దుబాయ్‌లో చెఫ్‌గా పని చేస్తున్న ఓ భారతీయుడు ఆన్‌లైన్‌లో మహిళలను అసభ్యంగా దూషించడం, అత్యాచారం చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలపై ఆ చెఫ్‌ని అరెస్ట్‌ చేయాలంటూ అక్కడి మహిళలు వందలాది మంది ఆందోళనకు దిగినట్లు పేర్కొంది. చెఫ్‌  త్రిలోక్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. అందులో ఓ భారతీయ మహిళను అత్యాచారం చేస్తానని బెదిరించాడు.

ప్రస్తుతం త్రిలోక్‌ ఫేస్‌బుక్‌ ఖాతా తొలగించినప్పటికీ.. అతని ప్రొఫైల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్లు మాత్రం యూఏఈకి వెళ్లేముందు ఢిల్లీలోని లలిత్‌ హోటల్‌లో చెఫ్‌గా పనిచేసినట్లు ఉంది. అయితే ఈ విషయంపై లలిత్‌ హోటల్‌ని సంప్రదించగా అతని చర్యలను పూర్తిగా ఖండిస్తూ.. గతంలో పనిచేసే వాడని దాదాపు సంవత్సర కాలంగా అక్కడ ఉద్యోగం మానేసినట్లు చెప్పింది. ప్రొఫైల్‌లో ఉన్న సమాచారం గురించి ఫేస్‌బుక్‌ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం యూఏఈలో ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో సమాచారం లేదు.

అయితే.. దుబాయ్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు ఎఫ్‌బీ ప్రొఫైల్‌లో ఉంది. సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన సందేశాలను పోస్ట్‌ చేసే వారిని యూఏఈ సైబర్‌ క్రైమ్‌ చట్టాల ప్రకారం విచారించవచ్చు. ఇదే సమయంలో త్రిలోక్‌పై ఈ క్రైమ్‌ పోర్ట్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సోషల్‌ మీడియా సలహా ఇచ్చింది. నేర నిరూపణ అయితే నిందితుడికి జైలు శిక్ష లేదా  రూ.50 వేల నుంచి 3 మిలియన్‌ డాలర్ల జరిమానాను విధించే అవకాశం ఉంది.

కాగా.. గతేడాది న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడుల్లో 50మంది చనిపోగా వాటిని సెలబ్రేట్‌చేసుకుంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన ఓ భారతీయుడిని దుబాయ్‌లోని ట్రాన్స్‌గార్డ్‌ గ్రూప్‌ విధుల్లోంచి తొలగించింది. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను చంపేస్తామని బెదిరిస్తూ పోస్ట్‌ పెట్టిన వ్యక్తిని కూడా అబుదాబీలో ఉద్యోగం నుంచి తొలగించారు. 2017లో ఓ భారతీయ జర్నలిస్ట్‌కు ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర సందేశాలను పంపినందుకు గాను మరో కేరళ ఉద్యోగిని ఉద్యోగం నుంచి తొలగించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top