గడ్డకట్టే చలిలోనూ 72 గంటలు శ్రమించి..

Indian Army successfully built the bridge over the Galvan River - Sakshi

గల్వాన్‌ నదిపై వంతెనను పూర్తి చేసిన భారత ఆర్మీ

చైనా కంటగింపునకు, గల్వాన్‌ ఘటనకు ప్రధాన కారణమైన గల్వాన్‌ వంతెన నిర్మాణాన్ని భారత సైన్యం విజయవంతంగా పూర్తి చేసింది. గల్వాన్‌ ఘటనతో ఏమాత్రం వెనుకంజ వేయని భారత సైనికాధికారులు మంగళవారం ఉదయం.. ఆర్మీ కంబాట్‌ ఇంజనీర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘గల్వాన్‌ నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలి’ అనేది ఆ ఉత్తర్వుల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన ఇంజనీర్లు, సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు. (చైనా కాఠిన్యంపై అమెరికా ఆగ్రహం)

ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ఆ పనులను ఏకబిగిన 72 గంటల పాటు కొనసాగించి, గురువారం మధ్యాహ్నం కల్లా పూర్తి చేశారు. వంతెనపై రెండు గంటలపాటు వాహనాలను నడిపి విజయవంతంగా పరీక్షించి చూశారు. జూన్‌ 15వ తేదీన రెండు బలగాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన ‘పెట్రోల్‌ పాయింట్‌ 14’కు ఈ వంతెన కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. 60 మీటర్ల పొడవైన ఈ బెయిలీ(ఎక్కడికైనా తీసుకెళ్లగలిగే వీలున్న) వంతెనపై ఫిరంగి దళ వాహనాలతోపాటు ఇతర అన్ని రకాల వాహనాలు రాకపోకలు సాగించవచ్చు. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం)

వాస్తవ నియంత్రణ రేఖ వద్దకు బలగాలు వేగంగా చేరుకునేందుకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఈ వంతెనతో దర్బాక్‌ నుంచి దౌలత్‌ బేగ్‌ ఓల్దీ వరకు 255 కిలోమీటర్ల మేర రహదారిని భారత్‌ కాపాడుకోగలదు. భారత్, చైనాలకు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన గల్వాన్‌ నది పరీవాహక ప్రాంతంలో మన దేశం చేపట్టిన నిర్మాణాల్లో ఈ వంతెన కూడా ఒకటి. సరిహద్దు ప్రాంతాల్లో భారత ఆర్మీ ఇంజనీర్ల సాయంతో బోర్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌(బీఆర్‌వో) తలపెట్టిన మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు.. చైనా ఎన్ని కుట్రలు పన్నినా కొనసాగుతాయని ఓ ఉన్నతాధికారి స్పష్టం చేశారు. (చైనా దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి..)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top