9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు

India is Total COVID-19 cases rise to 74281 with 2415 lifeless - Sakshi

గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదన్న ఆరోగ్య శాఖ

దేశంలో ఒక్కరోజులో 122 మరణాలు

న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్, మణిపూర్, మేఘాలయ, గోవా, లద్దాఖ్, మిజోరం, అండమాన్, నికోబార్‌ సహా 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. సిక్కిం, నాగాలాండ్, డయ్యూ డామన్, లక్షద్వీప్‌ల్లో ఇప్పటివరకు కేసులేమీ నమోదు కాలేదన్నారు. దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 74,281 కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు ఈ మహమ్మారితో 2,415 మంది చనిపోయారని వెల్లడించారు. గత 24 గంటల్లో 122 మరణాలు చోటు చేసుకోగా, 3,525 కొత్త కేసులు నమోదయ్యాయన్నారు.

ఇప్పటివరకు 24,385 మంది కోలుకున్నారని, ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 47,480 అని వివరించారు. ప్రస్తుతం మరణాల రేటు 3.2 శాతంగా, కోలుకుంటున్నవారి శాతం 32.83గా ఉందన్నారు. గత రెండు వారాలుగా కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం 11 రోజులుగా ఉందని, అయితే, గత మూడురోజుల్లో అది 12.6 రోజులకు మెరుగయిందని వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్‌లో కరోనా పరిస్థితిని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ ఎస్‌కే సింగ్‌ వివరించారు.

మే 12 నాటికి రాష్ట్రంలోని 22 జిల్లాలు కరోనా బారిన పడ్డాయని, మొత్తం 1,913 కేసులు నమోదయ్యాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు సుమారు 1.8 లక్షల బెడ్స్‌ కెపాసిటీతో 19 కోవిడ్‌ ప్రత్యేక ఆసుపత్రులు, 1.3 లక్షల బెడ్స్‌ సామర్ధ్యంతో 2040 కోవిడ్‌ స్పెషల్‌ హెల్త్‌ సెంటర్లు, 4.93 లక్షల బెడ్స్‌ సామర్థ్యంతో 5,577 కోవిడ్‌ కేర్‌ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 8,708 క్వారంటైన్‌ కేంద్రాలున్నాయన్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు చోటు చేసుకున్న మొత్తం 122 మరణాల్లో మహారాష్ట్రలో 53, గుజరాత్‌లో 24, ఢిల్లీలో 13 ఉన్నాయన్నారు.  

రైల్‌ భవన్‌ మూసివేత
భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం రైల్‌ భవన్‌ గురువారం నుంచి రెండు రోజుల పాటు మూతపడనుంది. ఆర్‌పీఎఫ్‌ ఉద్యోగి ఒకరు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అరుణ్‌ కుమార్‌ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకిందని, ఆ వ్యక్తి మే 6 నుంచి హోం క్వారంటైన్‌లోనే ఉన్నారని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top