భారత్‌లో... తొలి కరోనా కేసు | India is first coronavirus case confirmed in Kerala | Sakshi
Sakshi News home page

భారత్‌లో... తొలి కరోనా కేసు

Jan 31 2020 4:50 AM | Updated on Jan 31 2020 9:35 AM

India is first coronavirus case confirmed in Kerala - Sakshi

ఫేస్‌ మాస్క్‌లను కొనేందుకు హాంకాంగ్‌లో ఓ దుకాణం ముందు క్యూలో నిల్చున్న స్థానికులు

న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌కు సంబంధించి భారత్‌లో తొలి కేసు నమోదైంది. చైనాలోని వుహాన్‌ యూనివర్సిటీలో చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని గురువారం భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ యువతిని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. తదుపరి పరీక్షల అనంతరం శుక్రవారం పేషెంట్‌కి సంబంధించిన తుది నివేదికను వెల్లడిస్తామని ఐసీఎంఆర్‌ – ఎన్‌ఐవి పూణె డైరెక్టర్‌ ప్రియా అబ్రహం తెలిపారు. కరోనా వైరస్‌కు సంబంధించి దేశంలోని పలు నగరాల్లో అనుమానిత కేసులు నమోదయ్యాయి. కానీ వైరస్‌ సోకినట్లు ధ్రువీకరించిన తొలి కేసు ఇదే.  కేరళ వైద్యాధికారులు బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం 800 మందిని పలు ఆసుపత్రుల్లో పరిశీలనలో ఉంచారు.

చైనా నుంచి భారతీయులు వెనక్కి
చైనాలోని వుహాన్‌ నుంచి భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న హ్యుబయి రాష్ట్రం నుంచి భారత పౌరులను వెనక్కి రప్పించేందుకు రెండు విమానాలకు అనుమతినివ్వాలని చైనాను భారత్‌ కోరింది. అందుకు చైనా ఓకే చెప్పిందని వూహాన్‌లోని భారత ఎంబసీ తెలిపింది.   చైనా నుంచి వచ్చే వారిని 14 రోజుల పాటు  అబ్జర్వేషన్‌లో ఉంచుతామని తెలిపింది.

భారీగా నిధులు వెచ్చిస్తోన్న చైనా
చైనాలో కరోనా వైరస్‌ బారినపడి 170 మంది మరణించారు. మరో 7,711 మందికి ఈ వైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 17 దేశాలకు విస్తరించింది.  
కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దాదాపు నాలుగు బిలియన్‌ డాలర్ల నిధులను చైనా ప్రభుత్వం కేటాయించింది. ఈ వైరస్‌పై యుద్ధానికి ఆర్థిక వనరుల లోటు రాకూడదని చైనా భావిస్తోంది. అలాగే వైరస్‌ని నివారించే వాక్సిన్‌ని కనుగొనే ప్రయత్నంలో భాగంగా పరిశోధనలకు సైతం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement