గంటకు 1,105 మందికి

India COVID-19 death toll rises to 21604 as total cases reach 793802 - Sakshi

ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 26,506 కొత్త కరోనా కేసులు 

24 గంటల్లో 475 మంది మృతి 

62.42%కి చేరిన రికవరీ రేటు  

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్‌ పడగ విప్పుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 26,506 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అంటే గంటకు 1,105 మంది కరోనా సోకినట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఇప్పటిదాకా ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు బయటపడడం ఇదే మొదటిసారి. గురువారం నుంచి శుక్రవారం వరకు.. ఒక్కరోజులో 475 మంది కరోనాతో మృతిచెందారు. దీంతో మొత్తం కేసులు 7,93,802కు, మరణాలు 21,604కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌ కరోనా కేసులు 2,76,685 కాగా, 4,95,512 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. గత 24 గంటల్లో 19,138 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 62.42 శాతానికి చేరింది.   

మరణాల రేటు తగ్గుముఖం
దేశంలో కరోనా సంబంధిత మరణాల రేటు క్రమంగా తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. నెల రోజుల క్రితం మరణాల రేటు 2.82 శాతం కాగా, ప్రస్తుతం 2.72 శాతం మాత్రమేనని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఇది తక్కువేనని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా నమోదయ్యిందని తేల్చిచెప్పింది. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 62.42 శాతంగా ఉందని తెలియజేసింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రికవరీ రేటు జాతీయ సగటు కంటే అధికమేనని వివరించింది.

2021లో వ్యాక్సిన్‌!
కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ప్రారంభంలో సిద్ధమయ్యే అవకాశం ఉందని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ విభాగం, సీఎస్‌ఐఆర్‌ శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ముఖ్య సాంకేతిక సలహాదారు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి తెలియజేశారు. కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ అధ్యక్షతన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీపై  ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం శుక్రవారం పార్లమెంట్‌ ప్రాంగణంలో సమావేశమైంది. దేశంలో కరోనా తాజా పరిస్థితిపై చర్చించారు.

హోం క్వారంటైన్‌లో యడియూరప్ప
సాక్షి, బెంగళూరు:   కర్ణాటక ముఖ్యమంత్రి బిఎస్‌ యడియూరప్ప కార్యాలయంలో పనిచేసే కొందరు ఉద్యోగులు కరోనా వైరస్‌ బారినపడ్డారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం/అధికార నివాసాన్ని ఐదు రోజులపాటు మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. శానిటైజేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత తెరుస్తామని చెప్పారు. దేశంలో కరోనా ప్రబలిన తర్వాత కర్ణాటక సీఎం ఆఫీసును మూసివేయడం ఇది రెండోసారి. ముందు జాగ్రత్త చర్యగా 77 ఏళ్ల యడియూరప్ప హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన శుక్రవారం ప్రకటించారు. రాబోయే కొన్నిరోజుల పాటు ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని తెలిపారు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top