యువ ఐఏఎస్ అనుమానాస్పద మృతి


* అసాంఘిక శక్తుల పీచమణిచిన ధీరశాలి

*రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి ముప్పు

* హత్య గావించి ఆత్మహత్యగా చిత్రీకరించారన్న అనుమానాలు


 

 సాక్షి, బెంగళూరు/కోలారు:  నిజాయితీ గల ఐఏఎస్ అధికారిగా ప్రజల మన్ననలను అందుకున్న యువ ఐఏఎస్ అధికారి డి.కె.రవి(36) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి అధికారికంగా ధ్రువీకరించారు. బెంగళూరులోని తావరెకెరెలో తన భార్య కుటుంబసభ్యులు నివాసముంటున్న ప్రాంతానికి సమీపంలోనే ఓ అపార్‌‌టమెంట్‌లో ఆయన ఉంటున్నారు.



సోమవారం ఉదయం నుంచి ఆయన భార్య కుసుమ ఫోన్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదు. దీంతో సాయంత్రం ఆమె ఇంటికి చేరుకుని తన వద్ద ఉన్న మారు తాళంతో తలుపు తీసుకుని లోపలకు వెళ్లారు. ఆ సమయంలో ఉరివేసుకున్న స్థితిలో ఉన్న ఆయన శరీరాన్ని గుర్తించి, ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు.  విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, కోలారు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తనదైన ముద్ర వేయడంతో పాటు కోలారులో ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపారు. కోలారు ప్రజలకు ఏ సమస్య వచ్చినా అత్యంత వేగంగా స్పందించే అధికారిగా డి.కె.రవికు మంచి పేరు  ఉంది.


కోలారులోని అనేక చెరువులను పునరుజ్జీవనం చేసి అక్కడి ప్రజలకు నీటిని అందించేందుకు తనవంతు కృషి చేశారు. అంతేకాదు రెవెన్యూ అదాలత్, పోడి అదాలత్ వంటి కార్యక్రమాలతో రైతుల మనసుల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక తాను ఒక ఐఏఎస్ అధికారి అనే భేషజాన్ని ఏ రోజూ దరికి రానివ్వని డి.కె.రవి కోలారులోని విద్యార్థులకు సైతం అతిథి ఉపన్యాసకుడిగా మారి పాఠాలు చెప్పేవారు. అదే సందర్భంలో కోలారులోని ఇసుక మాఫియాపై డి.కె.రవి ఉక్కుపాదం మోపడంతో అతన్ని అక్కడి నుంచి బదిలీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిళ్లు పెరిగాయి. డి.కె.రవిని కోలారు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ బదిలీ చేయకూడదంటూ ఆ జిల్లా ప్రజలు బంద్‌ని పాటించారంటే అక్కడి ప్రజల మనసుల్లో ఆయన ఎంతటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.



ఇక ప్రజల మనోభావాలకు ఏమాత్రం విలువనివ్వని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గి ఆయన్ను వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్‌గా బదిలీ చేస్తూ బెంగళూరుకు పంపించింది. వాణిజ్య పన్నుల శాఖకు బదిలీ అయిన తర్వాత కూడా నగరంలోని అనేక రియల్ ఎస్టేట్ ఇతర సంస్థల నుంచి పన్నులను రాబట్టడంలో తనదైన ముద్ర కనబరిచారు. దీంతో ఆయనకు రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి సైతం బెదిరింపులు ఎదురయ్యాయి. తనకు ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి సైతం ప్రమాదం పొంచి ఉందని డి.కె.రవి అనేక సందర్భాల్లో తన సంబంధీకుల వద్ద, ఇతర అధికారుల వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అతన్ని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారన్న అనుమానాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు.

 

 మధ్యతరగతి కుటుంబం నుంచి...

 కర్ణాటకలోని తుమకూరు జిల్లా కునిగల్‌కు చెందిన డీ.కే రవి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. 1979 జనవరి 10న జన్మించిన రవి 2009 ఐఏఎస్ బ్యాచ్ అధికారిగా ఎంపికయ్యారు.  ఐఏఎస్ అయ్యే క్రమంలో అనేక కష్టాలను డి.కె.రవి ఎదుర్కొన్నారని స్థానికులు చెబుతుంటారు. కాగా, బెంగళూరుకు చెందిన కుసుమను డి.కె.రవి మూడేళ్ల ముందు పెళ్లి చేసుకున్నారు.

 

 నేడు కోలారు బంద్

 తమ అభిమాన అధికారి అకాలమృతి కోలారు జిల్లా వాసులను తీవ్రంగా కలిచి వేసింది. ఆయన మృతికి  సంతాపంగా మంగళవారం కోలారు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.



 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top