ముంబై వాసులను రక్షిస్తున్న చిరుత పులులు!

How Leopards Came To Live Peacefully With Mumbai Residents - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముంబై నగరంలోని సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌లో సంచరించే చిరుత పులులు అప్పుడప్పుడు బయటకు జనావాస ప్రాంతాల్లోకి రావడం చూసి ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. వాస్తవానికి వాటి వల్ల ప్రజలకు పెద్దగా ముప్పేమి వాటిల్లడం లేదు. అవి జనావాస ప్రాంతాల్లోకి ప్రజల కోసం రావడం లేదు. వీధి కుక్కల కోసం అవి వస్తున్నాయని, వాటి వల్ల ముంబై ప్రజలకు మేలే ఎక్కువ జరుగుతోందని తేలింది. చిరుత పులులు తాము రోజు తీసుకొనే ఆహారంలో దాదాపు 40 శాతం వీధి కుక్కలే ఉంటున్నాయి. ఈ విషయాలు ‘ఫ్రాంటయిర్స్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి.

104 చదరపు కిలోమీటర్లు విస్తరించిన సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌లో 42 చిరుత పులులు ఉన్నాయి. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గరి నుంచి ముంబై నగరంలోని ప్రతి కూడలిలో, ప్రతి వీధి చివరలో కొన్ని వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ముంబై నగరం మొత్తం మీద ఏ రోజున లెక్కించిన సరాసరి 95 వేల వీధి కుక్కలు ఉంటాయన్నది ఓ అంచనా. వీటి వల్ల ఏటా ప్రజలకు 75 వేల గాయాలు అవుతున్నాయి. ఇవి అధికారికంగా నమోదయిన గాయాలు మాత్రమే. నమోదు కాకుండా కూడా మరికొన్ని వేల గాయాలవుతున్నాయన్నది అంచనా. ఈ గాయాల వల్ల రాబిస్‌ సోకి వందల మంది మరణిస్తున్నారు. అధికారికంగా నమోదైన లెక్కల ప్రకారం గత 20 ఏళ్లలో నగరంలో వీధి కుక్కల గాయాల వల్ల 420 మంది మరణించారు.

పార్క్‌ సమీపంలో ఏడాదికి 800 నుంచి రెండువేల వీధి కుక్కలు చిరుత పులులకు ఆహారంగా మారుతున్నాయని, తద్వారా ముంబై నగరంలో వీధి కుక్కలు అదుపులో ఉంటున్నాయని పాపులేషన్‌ బయోలజిస్ట్‌ లెక్స్‌ ఐబీ, వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన సర్వేయర్‌ నికిత్‌ చేసిన తాజా అధ్యయనంలో తేలింది. చిరుత పులులు వీధి కుక్కలను వేటాడడం వల్ల కుక్కల స్టెరిలైజేషన్‌కు అయ్యే ఖర్చు ఏటా దాదాపు 18 లక్ష రూపాయలు మున్సిపాలిటీకి మిగులుతోందని కూడా సర్వే తేల్చింది.

చిరుత పులులను తరలించినట్లయితే...
సంజయ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ నుంచి చిరుత పులులను తరలించినట్లయితే పట్టణీకరణ పెరుగుతుంది, అటవి ప్రాంతం తరగిపోతుంది. అసంఖ్యాకంగా వీధి కుక్కలు పెరిగి పోతాయి. పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుంది. అంతేకాకుండా ఏటా వీధి కుక్కల కాట్లు దాదాపు ఐదువేలు పెరుగుతాయి. వాటి చికిత్స కోసం ఏటా 1.38 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. చిరుత పులులు కుక్కలు, పందులనే కాకుండా అప్పుడప్పుడు మనుషులపై కూడా దాడులు చేస్తున్నట్లు వార్తలు వచ్చినప్పుడు ప్రజలు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2002లోనే 25 మంది చిరుత పులుల కారణంగా మృత్యువాత పడ్డారు. ఆ సంఘటనలపై దర్యాప్తు జరపగా ఇతర పార్కుల నుంచి నేషనల్‌ పార్కుకు తరలించిన చిరుతల వల్లనే ఆ దాడులు జరిగాయని తేలింది. పార్క్‌లో ఉన్న చిరుతలు పూర్తిగా కుక్కల ఆహారానికే అలవాటు పడ్డాయి. గత నాలుగేళ్లుగా చిరుతల కారణంగా ఒక్కరు కూడా ఇక్కడ మృత్యువాత పడకపోవడం కూడా ఈ విషయాన్ని నిరూపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top