కేంద్ర బడ్జెట్‌లో హోం శాఖకు 10.2 శాతం మేరకు కేటాయింపులు పెరిగాయి.
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో హోం శాఖకు 10.2 శాతం మేరకు కేటాయింపులు పెరిగాయి. మహిళల రక్షణ, అంతర్గత భద్రత, కశ్మీరీ పండిట్లకు పునరావాసంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. మహిళలకు రక్షణ కల్పించడానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. హోం శాఖకు రూ.62,124.52 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది హోం శాఖకు రూ.56,372.45 కోట్లు ఇచ్చారు. మహిళలకు భద్రత, న్యాయం, అవగాహనకు సంబంధించిన కార్యక్రమాలకు గాను నిర్భయ నిధికి రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.
అదేవిధంగా కశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం రూ.580 కోట్లు కేటాయించారు. నక్సల్ వ్యతిరేక ఆపరేషన్లతో పాటు తరచూ అంతర్గత భద్రత విధుల్లో పాల్గొనే ప్రపంచంలోనే పెద్దదైన పారామిలటరీ దళం.. సీఆర్‌పీఎఫ్ కోసం రూ.14,089.38 కోట్లు కేటాయించారు. బీఎస్‌ఎఫ్‌కు 12,517.82 కోట్లు, ఐటీబీపీకి రూ.3,736.47 కోట్లు ఇచ్చారు. ఇక దేశంలోని చాలావరకు విమానాశ్రయాలు, అణు కేంద్రాలు, పరిశ్రమలు తదితరాలకు రక్షణగా ఉండే సీఐఎస్‌ఎఫ్‌కు రూ.5,196.65 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జీ), ఐబీ, ఢిల్లీ పోలీసు విభాగానికి కూడా కేటాయింపులు జరిపారు.