
ఎమ్మెల్యే కోటంరెడ్డితో శ్రీకాంత్(ఫైల్)
చక్రం తిప్పిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు హోంమంత్రి సహకారంతోనే పెరోల్
విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యలు
ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: హత్య కేసులో నేరం రుజువై నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న శ్రీకాంత్ పెరోల్ వెనుక హోంశాఖ హస్తం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పెరోల్‌పై విడుదలైన శ్రీకాంత్ జల్సాలు చేస్తూ పలువురికి ఫోన్లు చేసి బెదిరింపులకు దిగిన విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం షాక్‌కు గురైంది. ఆగమేఘాలపై పెరోల్ రద్దు చేస్తూ, ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం, ఎమ్మెల్యేలు కలిసి చేసిందంతా చేసి ఎల్లో మీడియా ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా వైఎస్సార్‌సీపీకి అంటగట్టే య త్నం చేస్తుండడం అందరినీ విస్మయపరుస్తోంది.
జైలు నుంచి పారిపోయిన చరిత్ర సొంతం..
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ టీడీపీలో క్రియాశీలక కార్యకర్త. శ్రీకాంత్ ఓ హత్య కేసులో 2010 నుంచి జిల్లా కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. 2014లో ఆయన సెమీ ఓపెన్ జైల్లో పని చేస్తూ తప్పించుకుని పరారయ్యాడు. నాలుగున్నరేళ్ల తర్వాత తిరిగి పోలీసులకు లొంగిపోయాడు. టీడీపీ నేతల అండదండలు ఉండడంతో శ్రీకాంత్ నాలుగున్నరేళ్లు ఎక్కడున్నాడు? ఏం చేశాడనే విషయం ఎవరికీ తెలియదు.
అడుగడుగునా అధికార పార్టీ అండ..
జైలులో ఉన్నప్పుడు వివిధ నేరాల్లో పట్టుబడి జైలుకు వచ్చిన నిందితులతో మాటలు కలిపి వారికి అవసరమైన సహాయం అందించేవాడని, వారు బయటకు వెళ్లిన తర్వాత వారి ద్వారా సెటిల్‌మెంట్లు చేయించేవాడన్న ప్రచారం కూడా ఉంది. జైల్లో ఉన్న ఖైదీలతో కలిసి జైలు సిబ్బందిపై తిరగబడిన ఘటనలు లేకపోలేదు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేల ద్వారా జైలు అధికారులను బెదిరించేవాడని తెలిసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు అధికారులపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చి అనారోగ్యం పేరుతో ఆస్పత్రుల్లో రోజుల తరబడి గడిపేవాడు. ఆ ఆస్పత్రుల్లో తన స్నేహితురాలితో సన్నిహితంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జైలు నుంచే బయట వ్యక్తులను శాసించే స్థాయికి ఎదిగాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేల ముఖ్య అనుచరుడు కావడంతో అధికారులు అతన్ని నిలువరించే సాహసం చేయలేకపోయారు.
పోలీసు ఉన్నతాధికారుల మాట కాదని..
ఇంత అధికార బలం ఉండడం వల్లే టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే పెరోల్ ఇవ్వొద్దని, అతను బయటకొస్తే శాంతిభద్రతలు అదుపు తప్పే అవకాశం ఉందని తిరుపతి జిల్లా ఎస్పీతోపాటు, గూడూరు డీఎస్పీ, సీఐ, జిల్లా కేంద్ర కారాగార సూపరింటెండెంట్ హోంశాఖ దృష్టికి తీసుకెళ్లినా, అనూహ్యంగా గత నెల 30న శ్రీకాంత్‌కు పెరోల్ మంజూరు చేస్తూ జీఓ విడుదలైంది. ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, హోంమంత్రి అనిత కనుస న్నల్లోనే 30 రోజుల పెరోల్ మంజూరైనట్లు ప్రచారం జరుగుతోంది.
దీంతో శ్రీకాంత్ బయటకు వచ్చేశాడు. హోంమంత్రి అనిత సంతకం ఆధారంగానే శ్రీకాంత్ పెరోల్‌పై వచ్చినట్లు అతని సన్నిహితురాలు అరుణ స్పష్టం చేయడం గమనార్హం. బయటకు వచ్చిన శ్రీకాంత్ జల్సాలు చేయడం, బెదిరింపులకు దిగటం వంటి అంశాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. హడావుడిగా పెరోల్‌ని రద్దు చేసింది.
నాకు రక్షణ కల్పించాలి శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తనకు కొందరితో ఆపద పొంచి ఉందని, వారి నుంచి రక్షణ కల్పించాలని శ్రీకాంత్ సన్నిహితురాలు అరుణ సోమవారం ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కోరినట్లు సమాచారం. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అసత్య కథనాలు ప్రచురించిన ఓ చానల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసు అ«ధికారులను కోరారు. అంతక్రితం పెరోల్‌కు సంబంధించి ఆమె తెలిపిన వివరాలు ఇలా... ‘‘పెరోల్ అర్జీని హోం మంత్రికి పంపారు. ఆమె నుంచి వచ్చిన ఫైలే సర్క్యులేట్ అయి పెరోల్ మంజూరైంది.
హోంమంత్రికి తెలియకుండా జరిగిందా? తెలిసి జరిగిందా అనేది మాత్రం తెలియదు. పెరోల్ రద్దు వెనుక ఏం జరిగిందో తెలియదు కానీ అఫిషియల్‌గా సెన్సిటివ్ విషయం ఉందని అందుకే రద్దు చేస్తున్నట్లు జీఓలో పొందుపరిచారు. పెరోల్ జీవోను రద్దు చేయడం హోంశాఖ చరిత్రలోనే ఫస్ట్ కేసు. నాపై మీడియా, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న కథనాల్లో నిజం లేదు. శ్రీకాంత్ అంటే నాకు ఇష్టం. మేం పెళ్లిచేసుకోబోతున్నాం. శ్రీకాంత్ పెరోల్‌పై ఆయన తండ్రి పెట్టుకున్న వినతిపత్రాన్ని ప్రభుత్వం ఆమోదించిందే తప్ప దీనివెనుక నేను చక్రం తిప్పిందేమిలేదు’’, అని పేర్కొన్నారు.