
‘సీసీటీఎన్‌ఎస్’ద్వారానే సాధ్యం.. మరింత కట్టుదిట్టంగా అమలు
ఇప్పటికే నేరాల వారీగా నిందితుల జాబితా..
ఫొటోలు సహా వివరాల కంప్యూటరీకరణ
దేశంలోని 17,082 పోలీసుస్టేషన్లకు లింకు
ఎన్‌సీఆర్‌బీ పర్యవేక్షణలో సీసీటీఎన్‌ఎస్..
మూడు నెలలకో నివేదిక.. అమల్లో తెలంగాణ పోలీసు భేష్..
సాక్షి ప్రతినిధి, వరంగల్: పెచ్చరిల్లుతున్న తీవ్రవాదం.. హద్దుమీరుతున్న ఉగ్రవాదం.. పెట్రేగిపోతున్న అసాంఘిక కార్యకలాపాలు.. దోపిడీలు, దొమ్మీలు.. వీటన్నింటినీ అరికట్టేందుకు హోంశాఖ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని నూటికి నూరు శాతం వినియోగంలోకి తెస్తోంది. గతంలో ఇంట్రానెట్, ఈ–కాప్స్‌ల ద్వారా పోలీసు వ్యవస్థ ఆధునికీకరణ, నేరపరిశోధనలను సరళీకృతం చేసిన హోంశాఖ.. దేశం యూనిట్‌గా నేరస్తుల చిట్టాను రూపొందించడంపై దృష్టి సారించింది.
ఇప్పటికే క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) ద్వారా నేరాల వారీగా నిందితుల జాబితాను సిద్ధం చేసి ఏ మూలన నేరం జరిగినా వివరాలు కనుక్కునే విధంగా నెట్‌వర్క్ రూపొందించింది. రాష్ట్రాల వారీగా ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ, సీసీఎస్, టాస్‌్కఫోర్స్ తదితర నిఘా విభాగాలు సంయుక్తంగా కార్యాచరణను అమలు చేస్తున్నాయి.
కాగా ఇటీవలి సంఘటనల నేపథ్యంలో కరడుగట్టిన నేరస్తుల జాబితా దేశం యూనిట్‌గా రూపొందించడంపైనా కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. అయితే సీసీటీఎన్‌ఎస్ పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తేనే ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నారు.
సీసీటీఎన్‌ఎస్ ఎప్పటి నుంచి..?
క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ అమలుపై మొదటి సమావేశం 2009 జూన్ 19న అప్పటి నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) జాయింట్ డైరెక్టర్ పి.ఆర్.కె.నాయుడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగింది. సీసీటీఎన్‌ఎస్ ఏర్పాటుకు ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) స్పందించి ఆమోదించగా అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించింది.
వెంటనే సీసీటీఎన్‌ఎస్ ప్రాజెక్ట్ అన్ని స్థాయిల్లో .. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్ స్థాయిలో ఒక సమగ్ర వ్యవస్థను సృష్టించి పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పని చేస్తోంది. దశల వారీగా 2021 జూలై 1 నాటికి, దేశవ్యాప్తంగా 16,276 పోలీస్‌స్టేషన్లలో (పీఎస్‌లలో)15,735 (97 శాతం) పోలీస్‌స్టేషన్లలో కనెక్టివిటీ అందించారు.
2019 జూన్ 30 నుంచి 2021 జూన్ 30 వరకు నేషనల్ డేటాబేస్ దాదాపు 28 కోట్ల రికార్డులకు పెరగ్గా, డిజిటల్ పోలీస్ పోర్టల్‌ను మాస్టర్ పోలీస్ పోర్టల్‌గా మార్చారు. వేలిముద్రల నిల్వ, సామర్థ్యాన్ని మెరుగుపరచి పోలీసు దర్యాప్తుల్లో సీసీటీఎన్‌ఎస్ సిస్టమ్ గేమ్ ఛేంజర్‌గా మారింది.
సీసీటీఎన్‌ఎస్‌లో తెలంగాణ భేష్
నేషనల్ క్రైం బ్యూరో రికార్డ్స్(ఎన్‌సీఆర్‌బీ)–2022 ప్రకారం దేశంలోని 17,535 పోలీస్‌స్టేషన్లకు 17,082 (97.41 శాతం) పీఎస్‌లలో క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్, సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) అమలవుతోంది. దేశంలోని 36 రాష్ట్రాలు/యూటీలలో 14 రాష్ట్రాలలో 90 శాతానికి పైగా విజయవంతంగా సీసీటీఎన్‌ఎస్ అమలవుతున్న 16 రాష్ట్రాలలో తెలంగాణ కూడా ఉంది.
సీసీటీఎన్‌ఎస్ విధానం అమలుపై కేంద్ర హోంశాఖ ప్రతి మూడునెలలకోసారి సమీక్ష జరిపి నివేదిక రూపొందిస్తోంది. నేరం ఎక్కడ జరిగినా, ఎంతపెద్ద నేరమైనా, ఆ నేరస్తుడు పాతవాడే అయినా ఆ విషయాన్ని తెలుసుకోవడం గతంలో కష్టంగా ఉండేది. ఇప్పుడలా కాకుండా ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా నేరస్తులను పోల్చుకునే విధంగా వివిధ రకాల నేరస్తుల వివరాలు, ఫొటోలతో సహా డేటాబేస్ సిస్టంలో నిక్షిప్తం చేస్తున్నారు.
ఇలాచేస్తే సీసీటీఎన్‌ఎస్ సిస్టం, ఊహాచిత్రాల ద్వారా నేరస్తుల కోసం వెతకకుండా నేరుగా డేటాబేస్‌లో పొందుపరచిన ఫొటోలలోనే గుర్తించి దేశంలో ఎక్కడున్నా పట్టుకునే అవకాశం ఏర్పడిందని ఒక పోలీసు ఉన్నతాధికారి చెప్పారు.
కొత్త నేరస్తుల వివరాలు కూడా వెంటవెంటనే పొందుపరిచే అవకాశం ఉందని, తొలిసారిగా నేరస్తుల వివరాలు వేలి ముద్రలతో పాటు ఫొటో కూడా ఉండే సమాచార నిధిని (డేటాబేస్) పొందుపరుస్తున్నామన్నారు. సీసీటీఎన్‌ఎస్ సిస్టం వినియోగం ఇంకా పూర్తి స్థాయిలో ఉంటే నేర పరిశోధన తీరుతెన్నులు మరింత మారిపోతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ)– 2022 డేటా ప్రకారం
» దేశంలో మొత్తం కేసుల సంఖ్య : 58,24,946
» ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కేసులు: 35,61,379
» స్పెషల్, లోకల్ లాస్ (ఎస్‌ఎల్‌ఎల్) కేసులు: 22,63,567
» క్రైం రేటు (ప్రతి లక్ష మంది జనాభాకు..): 422.2
» దేశవ్యాప్తంగా కిడ్నాప్ కేసులు : 1,07,588
» కిడ్నాపైన వారిలో మహిళలు : 88,861
» మహిళలపై జరిగిన అకృత్యాలపై నమోదైన కేసులు: 4,45,256
» చిన్నారులపై దౌర్జన్యం కేసులు : 1,62,449
» ఆర్థిక నేరాల కేసులు : 1,93,385
» నమోదైన సైబర్ నేరాలు : 65,893
బ్యూరో ఆఫ్ పోలీసు రీసెర్చ్, డెవలప్‌మెంట్ – 2022 డేటా ప్రకారం
» దేశంలో పోలీసుస్టేషన్ల సంఖ్య: 17,535
» గ్రామీణ ప్రాంతాల్లో పీఎస్‌లు: 9,192
» పట్టణ ప్రాంతాల్లో పీఎస్‌లు: 5,057
» స్పెషల్ పర్పస్ పోలీసుస్టేషన్‌లు (అదనంగా) : 3,286