నేలను నమ్మిన వారిలో హిందువులే ఎక్కువ!

Hindus Take Up Farming, Muslims Looking Towards On Industrial Jobs - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని హిందువుల్లో అధిక శాతం మంది వ్యవసాయాన్ని నమ్ముకోగా, ఎక్కువ శాతం ముస్లిం జనాభా వ్యవసాయేతర వృత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని 2011 జనాభా లెక్కల రిపోర్టు వెల్లడించింది. మతాల ప్రాతికపదికన హిందూ, ముస్లిం జనాభా ఉద్యోగ, వ్యవసాయ వివరాలను శుక్రవారం ప్రకటించింది. మొత్తం హిందువుల్లో 45.40 శాతం మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తుండగా.. ఈ మొత్తంలో 28 శాతం మంది భూమిని సాగు చేయడం ద్వారా ఉపాధి పొందుతున్నారని తెలిపింది.  

60 శాతం ముస్లిం జనాభా పారిశ్రామిక రంగంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. అయితే, అక్షరాస్యతలో వారు హిందువుల కన్నా వెనకబడి ఉండడంతో ఉన్నతోద్యోగాలు పొందలేక పోతున్నారని తెలిపింది. పారిశ్రామిక రంగంలో దిగువ స్థాయి ఉద్యోగాలైన చేనేత, కుండల తయారీ, వడ్రంగి పని, హస్తకళలు వంటి కళాత్మక పనుల్లో ముస్లింలు ఎక్కువగా పని చేస్తున్నారని రిపోర్టు వెల్లడించింది. దేశంలో చాలా మంది ముస్లింలు భూములు లేని కారణంగానే పారిశ్రామిక రంగంలో ఉపాధి కోరుకుంటున్నారని విశ్లేషించింది. కాగా, దక్షిణ భారతంలో కంటే ఉత్తరం భారతంలో ముస్లిం జనాభా పెరిగిందని రిపోర్టు పేర్కొంది.

సచార్‌ కమిటీ ప్రకారం..
2005లో ఏర్పాటైన రాజేంద్ర సచార్‌ కమిటీ దేశంలో భూమి కల్గివున్న జనాభాలో హిందూ, ముస్లింలకు గణనీయమైన తేడా ఉందని నివేదించింది. గ్రామీణుల్లో 94 శాతం కుటుంబాలు సొంత భూమిని కలిగి ఉన్నాయని స్పష్టం చేసింది. వారిలో కూడా అగ్రవర్ణ హిందూ జనాభా చేతిలోనే అధిక భూమి ఉందని తెలిపింది. దాదాపు 87 శాతం జనాభా కనీసం ఒక ఎకరా భూమిని కలిగి ఉన్నారని తెలిపింది. కాగా, అన్ని మతస్తుల కంటే తక్కువగా (83 శాతం) ముస్లింలు భూమిని కలిగి ఉన్నారని వెల్లడించింది. అయితే, పట్టణ, నగర ప్రాంతాల్లో సొంత ఇళ్లు కలిగి ఉన్న వారిలో ముస్లింలే అధికంగా ఉన్నారని వెల్లడించింది. కాగా, 2001 నుంచి 2011 వరకు జనాభాలో 0.8 శాతం పెరుగుదల నమోదు కావడంతో ముస్లిం జనాభా 13.8 కోట్ల నుంచి 17.22 కోట్లకు ఎగబాకింది. అదే సమయంలో హిందూ జనాభా 0.7 శాతం తగ్గుదల నమోదు చేసింది. 2001లో 82.75 కోట్లుగా ఉన్న హిందూ జనాభా 96.63 కోట్లకు చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top