తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పై రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పై రాజ్యసభ చైర్మన్ హమిద్ అన్సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ నుంచి బయటకు వెళ్లాలని ఆదేశించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై చర్చకు శేఖర్ ఇచ్చిన నోటీసును అన్సారి తిరస్కరించారు. ఈ అంశంపై చర్చ జరగాల్సిందేనని ఆయన పట్టుబట్టారు. రక్షణ మంత్రి మనోహర్ పరికర్ వెంటనే ప్రకటన చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. పదేపదే సభా కార్యకలాపాలకు అడ్డుతగిలారు.
చైర్మన్ ఎన్నిసార్లు వారించినా ఆయన వినిపించుకోలేదు. దీంతో ఆగ్రహించిన అన్సారి సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా శేఖర్ రాయ్ ను ఆదేశించారు. ఈ రోజు సభలో అడుగుపెట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు. చైర్మన్ ఆదేశాలకు నిరసనగా తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. ఈ రోజు సభకు హాజరు కాబోమని ప్రకటించారు. అగస్టా- వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణంపై పెద్దల సభ ఈ రోజు కూడా దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనతో పలుమార్లు వాయిదా పడింది.