
సాక్షి నాలెడ్జ్ సెంటర్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ముస్లింల గురించి ఏ రాజకీయపక్షం పెద్దగా మాట్లాడడం లేదు. అయితే హిందువులను తనవైపు తిప్పుకున్న బీజేపీని ఓడించాలంటే మెజారిటీ వర్గాన్ని ఆకర్షించాలనే ‘తెలివి’ కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి వచ్చినట్టు కనిపిస్తోంది. హిందువులను కులాల వారీగానూ, మూకుమ్మడిగానూ కాంగ్రెస్ వైపు తిప్పుకోవడానికి ఆయన దేవాలయాలను సందర్శిస్తున్నారు.
గుజరాత్‌లో ఆయన ఏ మసీదును దర్శించలేదు. ముస్లింలు పెద్ద సంఖ్యలో నివసించే ప్రాంతాలకు వెళ్లినప్పుడు కూడా రాహుల్ వారు ధరించే తెల్ల టోపీ (స్కల్ క్యాప్) ఈసారి పెట్టుకోలేదు. ‘‘ముస్లింలు ఎలాగూ కాంగ్రెస్‌కు ఓటేస్తారు. మసీదుల్లోకి వెళ్లడం, ముస్లిం టోపీలు ధరించడం వల్ల హిందువుల ఓట్లు పడవేమో’’ అనే భావన వల్ల రాహుల్ ఇలా అతి జాగ్రత్తగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తగ్గుతున్న ముస్లింల ప్రాతినిధ్యం!
గుజరాత్‌లో 9 శాతం జనాభాగా ఉన్న ముస్లింలకు అసెంబ్లీలో అత్యధిక ప్రాతినిధ్యం 1980లో లభించింది. అప్పుడు 18 మంది ముస్లింలు పోటీచేయగా 12 మంది విజయం సాధించారు. అప్పటి నుంచి శాసనసభలో వారి ప్రాతినిధ్యం తగ్గిపోతూ వచ్చింది. 1985లో ఈ సంఖ్య 8కి పడిపోయింది. 2012 ఎన్నికల్లో కేవలం ఇద్దరే ముస్లింలు ఎన్నికయ్యారు. రాహుల్, ఇతర కాంగ్రెస్ నేతలు ముస్లింలపై తగినంత దృష్టి పెట్టకపోవడానికి హిందువుల ఓట్లు దూరమవుతాయనే భయం ఒక్కటే కారణం కాదు. 2007 అసెంబ్లీ ఎన్నికల నుంచి ముస్లిం ఓట్లు హస్తం గుర్తుకు పడడం తగ్గిపోవడం కూడా కాంగ్రెస్ ప్రచార ధోరణిలో మార్పునకు మరో కారణమని తెలుస్తోంది. ఈ నెల 9, 14 తేదీల్లో జరిగే ఎన్నికల్లో ముస్లింలలో 49 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేయవచ్చని, 27 శాతం బీజేపీవైపు మొగ్గు చూపిస్తారని తాజాగా సీఎస్‌డీఎస్ సర్వే అంచనావేసింది.
బీజేపీ శత్రువేం కాదు!
2009 నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా అహ్మదాబాద్, దాని పొరుగున ఉన్న ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ఇతర అసెంబ్లీ స్థానాల్లో చేరిపోయాయి. అంటే ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ఫలితాన్ని శాసించే స్థితిలో ముస్లింలు లేకుండాపోయారు. ఈ పరిణామం కూడా ముస్లిం ఓటుపై రాజకీయ పక్షాలకు ‘శ్రద్ధ’ తగ్గడానికి మరో కారణం. రాష్ట్రంలో వ్యాపారవర్గాలైన బోహ్రా, మెమన్, ఖోజా ముస్లింలలో చాలా మంది మారిన పరిస్థితులకు అనుగుణంగా బీజేపీ తమ శాశ్వత శత్రువు కాదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి మందగమనంతో ఆర్థిక సమస్యలనే ఎన్నికల ప్రచారాంశాలుగా చేయడంలో కాంగ్రెస్ సఫలమైంది. దీంతో గెలుపు ధీమా తగ్గిన బీజేపీ ముస్లింల వైపు కూడా కొద్దిగా కన్నేసినట్టు కనిపిస్తోంది.