గోవా డీజీపీ హఠాన్మరణం

Goa DGP Dies Of Cardiac Arrest - Sakshi

న్యూఢిల్లీ : గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డీజీపీ) ప్రణబ్ నందా ఢిల్లీలో శనివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. అధికారిక పని మీద ఢిల్లీలో ఉన్న ఆయన ఇవాళ తెల్లవారుజామున కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందినట్లు ఐజీ జస్పాల్ సింగ్ ప్రకటించారు. డీజీపీ నందా ఆకస్మిక మరణం తమకు షాక్ కలిగించిందని ఐజీ జస్పాల్ సింగ్ అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవా డీజీపీగా నందా బాధ్యతలు చేపట్టారు. 1988లో ఐపీఎస్ అధికారిగా చేరిన ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీ స్టేట్ క్యాడర్‌లలో పనిచేశారు. 2001లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఇంటలిజెన్స్ బ్యూరోలో డెప్యుటేషన్ పై చేరి దేశ, విదేశాల్లో వీవీఐపీ సెక్యూరిటీ వ్యవహారాలు పర్యవేక్షించారు.

కాబుల్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల్లో భారత రాయబార కార్యాలయాల్లో భారతీయుల భద్రతాధికారిగా సేవలందించారు. ఈయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇండియన్ పోలీస్‌ మెడల్, ప్రెసిడెంట్ పోలీస్‌ మెడల్, స్పెషల్ డ్యూటీ మెడల్ లభించాయి. ఢిల్లీ యూనివర్శిటీలో డిగ్రీ చదివి అనంతరం సోషియాలజీలో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా ఐపీఎస్ అధికారిణే. పుదుచ్చేరి డీజీపీగా ఆమె పని చేశారు. డీజీపీగా బాధ్యతలను స్వీకరించక ముందు దాదాపు రెండు దశాబ్దాల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఆమె సేవలందించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top