
జస్టిస్ గీతా మిట్టల్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ హైకోర్టు చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గీతా మిట్టల్ శనివారం కశ్మీర్ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ వోహ్రా జస్టిస్ మిట్టల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ప్రస్తుత, పదవీ విరమణ పొందిన హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలు హాజరయ్యారు. 1981లో జస్టిస్ మిట్టల్ న్యాయవాదిగా వృత్తిజీవితం ప్రారంభించారు. 2004 జూలై 16న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2017 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు గీత ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన జడ్జిగా ఉన్నారు.