నిత్యానంద నిర్వాకం: ఆ వీడియోల కోసమే మా అక్కను..

Girl Rescued From Nithyananda Ashram Says Had To Make Videos To Get Donations - Sakshi

అహ్మదాబాద్‌ : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందకు ఆశ్రమంలో జరుగుతున్న అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. విద్య పేరిట బాలికలను ఆశ్రమంలో చేర్పించుకుని.. వారి ద్వారా విరాళాలు సేకరించేందుకు అవలంబిస్తున్న విధానాలను బెంగళూరుకు చెందిన బాలిక మీడియాకు వెల్లడించింది. బెంగళూరుకు చెందిన జనార్ధన శర్మ దంపతులు తమ నలుగురు కూతుళ్లను 2013లో నిత్యానంద ఆశ్రమానికి చెందిన విద్యాసంస్థలో చేర్పించారు. ఈ క్రమంలో ఆశ్రమ నిర్వాహకులు... ఇటీవల ఆ నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న యోగిన సర్వఙ్ఞాన పీఠానికి బదిలీ చేశారు. విషయం తెలుసుకన్న శర్మ దంపతులు కూతుళ్లను కలిసేందుకు వెళ్లగా.. అందుకు నిరాకరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించి ఇద్దరు మైనర్‌ కూతుళ్లను ఇంటికి తీసుకువచ్చారు. అయితే మేజర్లు అయిన మరో ఇద్దరు కూతుళ్లు మాత్రం వారి వెంట రావడానికి నిరాకరించారు. ఈ క్రమంలో తమ కూతుళ్లను విడిపించాల్సిందిగా శర్మ దంపతులు గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో శర్మ దగ్గరికి వచ్చిన కూతురు(15) ఒకరు మాట్లాడుతూ... నిత్యానంద ఆశ్రమంలో మానసికంగా, శారీరకంగా తమను వేధింపులకు గురిచేసేవారని పేర్కొంది.  ‘2013 మేలో గురుకులంలో చేరాను. మొదట్లో అన్నీ బాగానే ఉండేవి. చాలా సరదాగా గడిచిపోయేది. అయితే 2017 నుంచి మాకు నరకం మొదలైంది. స్వామీజీకి విరాళాలు సేకరించేందుకు మాతో ప్రమోషనల్‌ వీడియోలు చేయించేవారు. లక్షల్లో విరాళాలు వచ్చేలా నటించాలంటూ ఇబ్బంది పెట్టేవారు. రూ. 3 లక్షల నుంచి ప్రారంభమై... రూ. 8 కోట్ల వరకు విరాళాలు వచ్చేవి. నగదు చెల్లించలేని వాళ్లు భూముల రూపంలో అది కూడా ఎకరాల్లో దానంగా ఇచ్చేవారు. ఆ వీడియోల కోసం అర్ధరాత్రి మమ్మల్ని నిద్రలేపేవారు. మాకు బాగా మేకప్‌ వేసి.. పెద్ద పెద్ద నగలు అలంకరించి స్వామీజీ వద్దకు తీసుకువెళ్లేవారు. మా అక్కను కూడా అలాగే చేశారు. నా ముందే తనతో వీడియోలు చేయించేవారు. మా అమ్మానాన్నలకు వ్యతిరేకంగా మాట్లాడాలని వేధించారు. నన్ను కూడా అలాగే చెప్పమన్నారు కానీ నేను వినలేదు. దాంతో ఇష్టం వచ్చినట్లుగా, అసభ్యరీతిలో దూషించారు’ అని చెప్పుకొచ్చింది.

ఇక బాలిక తండ్రి జనార్ధన శర్మ మాట్లాడుతూ.. తన ఫిర్యాదుతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారని తెలిపారు. తన కూతుళ్లకు మాయమాటలు చెప్పి తన వద్దకు రాకుండా చేస్తున్నారని వాపోయారు. విచారణ వేగవంతం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు నిత్యానంద పరారీలో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి నిత్యానంద ఆస్ట్రేలియా దగ్గర్లోని ద్వీపానికి వెళ్లినట్లు వార్తలు వెలువడుతున్నాయి.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top