రాహుల్‌ ఫోటోల రహస్యం వీడింది

Giriraj Singh Said Where The Shadow Of The Stick Vanished Mystery Solved - Sakshi

న్యూఢిల్లీ : పరమశివుడి దయ కోసం కైలాస్‌ మానస సరోవర్‌ వెళ్లిన రాహుల్‌ గాంధీ పంపించిన యాత్ర ఫోటోలు నిజమైనవి కావు అంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ ఈ వివాదంలో నిజానిజాలను వెలికితీసే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా రాహుల్‌ గాంధీ పంపిన ఫోటోలు నిజమైనవేనంటూ సదరు మీడియా సంస్థ తేల్చి చెప్పింది. రాహుల్‌ గాంధీ పంపిన ఫోటోలు దాదాపు మిట్ట మధ్యాహ్నం సమయంలో తీసినవని.. కనుక ఆ సమయంలో మనుషులవైనా, వస్తువులవైనా నీడలు చాలా చిన్నగా వాటి వెనక భాగంలో ఏర్పడతాయని తెలిపింది. అందువల్ల రాహుల్‌ గాంధీ చేతిలోని కర్ర నీడ ఫోటోలో కనిపించలేదని వివరించింది.

ఏమిటీ వివాదం..
ప్రస్తుతం కైలాస్‌ మానస సరోవర్‌ యాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీ ఒక యాత్రికునితో కలిసి దిగిన ఫోటోలను షేర్‌ చేశారు. అయితే ఈ ఫోటోలు నిజమైనవి కావంటూ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఫోటోలు నిజమైనవే అయితే వీటిల్లో రాహుల్‌ చేతికర్ర నీడ కన్పించడం లేదు కాబట్టి ఈ ఫోటోలు ఫోటోషాప్‌ ద్వారా తయారు చేసినంటూ ఆయన తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దాంతో నెటిజన్లు కూడా ఈ ఫోటోల పట్ల అనుమానం వ్యక్తం చేశారు.

మిస్టరి వీడిందిలా..
సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వదంతులకు చెక్‌ పెట్టే పనిలో పడింది ఒక ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ. అందులో భాగంగా ముందుగా రాహుల్‌ గాంధీ షేర్‌ చేసిన ఫోటోలోని వ్యక్తి వివరాలు సేకరించి అతనితో మాట్లాడింది. ఆ వ్యక్తి పేరు మిహిర్‌ పటేల్‌.. అహ్మదాబాద్‌కు చెందిన ఇంజనీర్‌. ప్రస్తుతం ఇతను మానస సరోవర్‌ యాత్ర నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. సదరు ఆంగ్ల మీడియా మిహిర్‌తో ఫోన్‌లో మాట్లాడి వాస్తావాలను వెలికీ తీసింది. ఈ ఫోటోల గురించి మిహిర్‌ మాట్లాడుతూ తాను రాహుల్‌ గాంధీతో కలిసి దొల్మా లా పాస్‌ దగ్గర ఈ నెల 6న ఈ ఫోటో దిగినట్లు తెలిపాడు. తనతో పాటు యాత్రకు వచ్చిన తన స్నేహితుడు కెనాన్‌ పటేల్‌ ఈ ఫోటోలను తీసినట్లుగా మిహిర్‌ తెలిపాడు. అప్పుడు సమయం దాదాపు ఉదయం 11. 45 - 12 .00 అవుతున్నట్లు వివరించాడు. అంతేకాక యాత్రలో దిగిన మిగతా ఫోటోలను వీడియోలను కూడా సదరు ఆంగ్ల మీడియా సంస్థకు అందజేశాడు.

వీటిని సదరు మీడియా ఇన్విస్టిగేషన్‌ టీం క్రిష్ణ అనే ఫోటోషాప్‌ ప్రొఫెషనల్‌ సాయంతో మిహిర్‌ చెప్తున్నది నిజమేనని.. ఆ సమయంలో దాదాపు మిట్ట మధ్యాహ్నం కావోస్తుందని అందువల్లే రాహుల్‌ గాంధీ చేతికర్ర నీడ కనిపించడంలేదని ప్రకటించింది. అంతేకాక కెమరా యాంగిల్‌ వల్ల కూడా ఇలా జరిగిందని తెలిపింది. మిట్ట మధ్యాహ్నం కావడంతో సూర్యుడు నిట్ట నిలువునా ఉండటం వల్ల వస్తువులు, మనుషుల నీడలు వారి వెనక ఏర్పడతాయని తెలిపారు. ఫోటోలో గమనిస్తే మిహిర్‌ చేతిలో పట్టుకున్న బ్యాగ్‌ నీడ కూడా దాని వెనక మిహిర్‌ కాళ్ల మీద పడటంతో సరిగా కనిపించడం లేదని వివరించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top