గెజిట్ రాగానే సీమాంధ్ర రాజధానిపై కమిటీ | Gazette notification for Telangana soon: Jairam Ramesh | Sakshi
Sakshi News home page

గెజిట్ రాగానే సీమాంధ్ర రాజధానిపై కమిటీ

Feb 22 2014 1:36 AM | Updated on Sep 2 2017 3:57 AM

తెలంగాణ బిల్లును ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలిస్తోందని జైరాం రమేశ్ వెల్లడించారు.

విభజన మొదలైంది
 ఉద్యోగుల పంపిణీకి కమిటీలు
 
 తెలంగాణ బిల్లును ప్రస్తుతం కేంద్ర న్యాయ శాఖ పరిశీలిస్తోందని జైరాం రమేశ్ వెల్లడించారు. రాష్ట్రపతి ఆమోదం రాగానే కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీచేస్తుందన్నారు. అందుకు నాలుగైదు రోజులు పట్టవచ్చని చెప్పారు. ఏ రోజు నుంచైతే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతుందో, దాన్నే అపాయింటెడ్ డే అంటారన్నారు. ‘‘నోటిఫికేషన్ వచ్చే తేదీకి , అపాయింటెడ్ (అవతరణ) తేదీకి మధ్య 5 రోజుల నుంచి 3 నెలలు పట్టిన సందర్భాలున్నాయి. ఉద్యోగుల విభజన పనులు చూసేందుకు రెండు కమిటీలను కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ శుక్రవారం ఏర్పాటు చేసింది. వీటిలో అఖిల భారత క్యాడర్ అధికారుల పంపిణీని ఒక కమిటీ, 84,000 మంది రాష్ట్ర స్థాయి ఉద్యోగుల పంపిణీని మరొకటి చూసుకుంటాయి. ఇక గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే సీమాంధ్ర రాజధాని అధ్యయనానికి కేంద్రం ఒక కమిటీ వేస్తుంది. రాజధాని ఏర్పాటుపై అది ఆరు నెలల్లోగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది’’ అన్నారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాదని, అది 60 ఏళ్ల డిమాండని చరిత్రను ఉటంకిస్తూ చెప్పారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఉంచాలని అప్పట్లో తొలి ఎస్సార్సీ చేసిన సిఫార్సు నుంచి 2013 జులై 30న సీడబ్ల్యూసీ చేసిన రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం దాకా అన్ని పరిణామాలనూ వివరించారు. అయితే, ‘రాజ్యసభలో మా కేంద్ర మంత్రి చిరంజీవి ప్రసంగం మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. అలా మాట్లాడతారని నేననుకోలేదు’ అంటూ జైరాం ముక్తాయించడం విశేషం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement