‘టీ’ కోసం 15 లక్షల వేతనాన్ని వదులుకున్నారు..!

Engineer Couple Give Up Jobs To Sell Tea - Sakshi

కష్టపడి పనిచేయడం కంటే ఇష్టపడి పనిచేయడంలోనే తృప్తి ఉందని.. సంపాదన కన్నా ఆత్మసంతృప్తి పొందడంలోనే ఆనందం ఉందంటున్నారు మాజీ టెక్కీ దంపతులు. నాగ్‌పూర్‌కు చెందిన నితిన్‌ బయానీ,  పూజ భార్యాభర్తలు. పూణెలోని ప్రఖ్యాత కంపెనీల్లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేసేవారు. ఇద్దరూ కలిసి నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించేవారు. ఎంత సంపాదించినా ఆ ఉద్యోగం వారికి తృప్తినివ్వలేదు. జీవితంలో ఏదో కొత్తదనం ఉండాలని భావించారు. అనుకున్నదే తడవుగా ఇద్దరూ ఉద్యోగాలు మానేశారు. తమకెంతో ఇష్టమైన ‘టీ’  తో వ్యాపారం చేయాలని ఫిక్స్‌ అయిపోయారు.

‘చాయ్‌విల్లా.. రిఫ్రెష్‌ యువర్‌ సెల్ఫ్‌’  పేరుతో నాగ్‌పూర్‌ సీఏ రోడ్డులో 5 నెలల క్రితం టీ స్టాల్‌ ప్రారంభించారు. ఈ వినూత్న స్టాల్‌లో 15 రకాల ఫ్లేవర్లతో టీ, కాఫీలతో పాటు వివిధ రకాల స్నాక్స్‌ కూడా అందుబాటులో ఉంటాయి. స్టాల్‌కి వెళ్లడం కుదరకపోతే వాట్సాప్‌, జొమాటోల్లో ఆర్డర్లు ఇవ్వొచ్చు.

చాయ్‌విల్లా యజమాని నితిన్‌ బయానీ ఎఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘పదేళ్లపాటు ఐబీఎమ్‌, కాగ్నిజెంట్‌ వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలలో పనిచేశాను. నా భార్య పూజ కూడా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరే. మా ఇద్దరికీ చేసే పనిలో తృప్తి లభించలేదు. అందుకే టీ షాప్‌ ప్రారంభించాం. ప్రస్తుతం నెలకు 5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాం. త్వరలోనే బిజినెస్‌ చెయిన్‌ను విస్తరిస్తామన్నారు. సోషల్‌ మీడియాను , అప్‌డేటెడ్‌ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ లాభాలు ఆర్జిస్తున్నామని తెలిపారు.

రిఫ్రెష్‌ అండ్‌ రిలాక్స్‌...
కస్టమర్‌ మాట్లాడుతూ.. ‘చాయ్‌విల్లా రీఫ్రెష్‌ యువర్‌సెల్ఫ్‌’  టీ తో రిఫ్రెష్‌తో పాటు రిలాక్స్‌ అవుతున్నామని, ఇక్కడ రుచితో పాటు శుభ్రతతో కూడిన టీ అందుబాటులో ఉంటుందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top