ఓటర్లలో పెరుగుతున్న నిర్లిప్తత

Detachment Increasing In Indian Voters - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ ఓటర్లలో నిర్లిప్తతా భావం ఎన్నికలకు ఎన్నికలకు పెరుగుతోందని అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్స్, సెంటర్‌ ఫర్‌ స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్, లోక్‌నీతి నిర్వహించిన సర్వేల్లో వెల్లడయింది. రానురాను ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల నమ్మకం సడలుతుండడం, ఎన్నికల్లో పోటీచేసే నేరచరితులు పెరిగిపోవడం, నిరుద్యోగం, ఆరోగ్యం లాంటి ప్రజా సమస్యలు ఎన్నికల సందర్భంగా ప్రధాన అంశాలు కాకపోవడం తదితర కారణాల వల్ల ఓటర్లలో నిర్లిప్తతా భావం పెరుగుతోందని ఆ సర్వేలు భావించాయి. ఇది ఒక్క భారత దేశానికే పరిమితం కాలేదని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పట్ల నిర్లిప్త ధోరణి పెరుగుతోందని ఆ సర్వేలు తెలియజేస్తున్నాయి.

ఓటర్ల నిర్లిప్తతకు ఓటింగ్‌ శాతానికి సంబంధం ఉంటుందా? అన్న ప్రశ్నకు సంబంధం ఉంటుందని కొన్ని సర్వే సంస్థలు తెలియజేస్తున్నప్పటికీ అది ఒక్కటే కొలమానం కాదని కూడా చెబుతోంది. ఎందుకంటే 2014లో జరిగిన ఎన్నికలకన్నా 2019 సార్వత్రిక ఓటింగ్‌లో పోలింగ్‌ శాతం పెరిగింది. నిర్లిప్తత ఉంటే పోలింగ్‌ శాతం తగ్గాలిగదా! అన్న వాదన కూడా లేకపోలేదు. ప్రజలు స్వచ్ఛందంగా పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లి ఓటేసే సంస్కృతి నశించడానికి కారణమే నిర్లప్తతా భావమని సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. ఓటర్లను బలవంతంగా తీసుకెళ్లడం వల్లనో, వారిని ప్రలోబాలకు గురిచేయడం వల్లనో ఓటింగ్‌ శాతం పెరుగుతోందని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. ఓటర్లలో నిర్లిప్తత పెరిగినట్లయితే ఓటింగ్‌లో ‘నోటా’కు వచ్చే ఓట్లు పెరుగుతూ ఉండాలిగదా! అన్న ప్రశ్నకు సర్వే సంస్థల నుంచి సరైన సమాధానం లేదు.

2013లో నోటాకు ఓటేసిన పద్ధతి ప్రవేశపెట్టగా అప్పటికన్నా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో నోటాకు ఓట్లు తగ్గిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికల్లో నేర చరితులు పెరుగుతుండడం వల్ల ఎన్నికల పట్ల ఓటర్లకు ఆసక్తి లేకుండా పోతోందని కూడా ఆ సంస్థలు తెలియజేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో నేర చరితులు గెలిచే అవకాశం 18 శాతం ఉండగా, నిజాయితీపరులు గెలిచే అవకాశం ఆరు శాతం ఉందని పలు సర్వేలు తెలిపాయి. నిజాయితీపరులకన్నా నేర చరితులు ఎక్కువగా గెలిచే అవకాశం ఎందుకుందని ప్రశ్నిస్తే బెదిరింపులతోపాటు డబ్బును విరివిగా ఖర్చు పెట్టడం వల్లనే వారు ఎక్కువగా గెలుస్తున్నారు.

ముస్లింలలోనే ఎక్కువ!
హిందువులు, క్రైస్తవులతో పోలస్తే ముస్లింలలోనే ఓటు వేయాలనే పట్టుదల ఎక్కువగా కనిపించినట్లు ఈ సర్వేలు తెలియజేశాయి. అలాగే ప్రతిపక్ష పార్టీల్లోకెల్లా పాలకపక్ష ఎన్డీయేలోనే ఓటు వేయాలనే కాంక్ష బలంగా కనిపించిందని ఆ సర్వేలు తెలియజేశాయి. 2014లో ఎన్నికల సందర్భంగా అవినీతి కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని, ఈసారి ప్రభుత్వ వ్యతిరేకతగానీ అటు కాంగ్రెస్‌ పార్టీ పట్ల సానకూలతగానీ పెరగలేదని, అందుకే ఈసారి ఓటర్లలో నిర్లిప్తతా భావం కనిపిస్తోందని ఆ సంస్థలు వాదిస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ముందు దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం ప్రధాన ఎన్నికల సమస్యలుకాగా పుల్లామా దాడి అనంతరం పాకిస్థాన్‌లోని బాలకోట్‌ స్థావరంపై భారత వైమానిక దళం జరిపి దాడులు ప్రధానమయ్యాయి. అందుకే మోదీ కూడా అభివద్ధి మంత్రం పక్కన పడేసి దేశ భద్రత, జాతీయ వాదాన్ని అందకున్నారని ఆ సంస్థలు అంటున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top