
ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు 'లష్కరే' కుట్ర!
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అనుకూలంగా పనిచేస్తున్న సబీర్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆత్మాహుతి దాడులు జరిపేందుకు ఉగ్రవాద గ్రూపు లష్కరే తాయిబా పథకం రచిస్తున్నట్టు తెలిసింది. ఢిల్లీలో రద్దీగా ఉన్న ప్రదేశాలతోపాటు, ప్రముఖ వ్యక్తులపైనా దాడులు జరుపాలని లష్కరే భావిస్తున్నది. ఈ విషయాన్ని ఇటీవల నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి అనుకూలంగా పనిచేస్తున్న సబీర్ అనే వ్యక్తిని ఢిల్లీ పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. జమ్మూ చెందిన సబీర్ వృత్తి రీత్యా టీచర్గా పనిచేస్తూ.. ఐఎస్ఐతో సంబంధాలు కలిగి ఉన్నాడు. దీంతో తాజాగా భారత్లో అరెస్టయిన ఐఎస్ఐ ఏజెంట్ల సంఖ్య నాలుగుకు చేరింది. సబిర్పై ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో ఢిల్లీలో దాడులకు లష్కరే కుట్ర పన్నుతున్న సంగతిని వెల్లడించారు.
గతంలో జమ్ముకశ్మీర్‌లో చురుగ్గా పనిచేసిన లష్కరే ఏజెంట్లు దుజన, ఉకాషా దాడులకు సాంకేతిక సహకారం అందించేందుకు ఢిల్లీకి వచ్చారని పోలీసులు తెలిపారు. నుమన్, జైదీ, ఖుర్షీద్ వంటి మారుపేర్లతో ఢిల్లీలో ఉన్న ఏజెంట్లతో టాప్ కమాండర్లు నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారని, వీరిని పట్టుకునేందుకు ఉత్తర భారతంలో తీవ్రంగా గాలిస్తున్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా, ఐఎస్ఐకి సంబంధాలున్న ఆరోపణలపై రిటైర్డ్ ఆర్మీ జవాన్‌ను అరెస్టుచేశారు.