బైక్‌లో మ్యూజిక్‌ ప్లే చేసినందుకు చలానా

Delhi Man Was Fined Playing Music on Harley Davidson Bike - Sakshi

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన నూతన మోటారు వాహన చట్టం-2019 జనాలను బెంబేలెత్తిస్తోన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ నూతన చట్టంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చట్టం పేరు చెప్పి సామాన్యుల జేబు గుల్ల చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్రం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తమ రాష్ట్రాల్లో అమలు చేయబోవడం లేదని ప్రకటించాయి. ఈ నేపథ్యంలో నూతన చట్టం పేరు చెప్పి.. అధికారులు వాహనదారులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో తెలిపే సంఘటన ఒకటి దేశ రాజధానిలో చోటు చేసుకుంది. రాఘవ్‌ స్వాతి పృథి అనే వ్యక్తి తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసిన ఈ స్టోరీ ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

ఆ వివరాలు.. రాఘవ్‌ స్వాతి పృథి కొద్ది రోజుల క్రితమే హార్లీ డేవిడ్సన్‌ రోడ్‌ గ్లైడ్‌ బైక్‌ని కొన్నాడు. ఈ బండి ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గానే వస్తుంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన గురించి అతడి మాటల్లోనే.. ‘తిలక్‌ నగర్‌లో నేను నా  బైక్‌పై తిరుగుతుండగా.. నా ఎదురుగా ఓ పోలీసు వాహనం వచ్చింది. అందులోంచి ఓ అధికారి దిగి నా బండిని ఆపమని చెప్పాడు. ఆ తర్వాత బండికి సంబంధించిన అన్ని పేపర్లు తీసుకుని నన్ను పోలీస్‌ స్టేషన్‌కు రమ్మన్నారు. బాధ్యత గల పౌరుడిగా నేను వారు చెప్పినట్లే చేశాను. పోలీస్‌ స్టేషన్‌లోనికి వెళ్లాక అధికారులు ఉన్నట్లుండి నా మీద అరవడం ప్రారంభించారు. బైక్‌లో లౌడ్‌ స్పీకర్లు పెట్టి రోడ్ల మీద తిరుగుతున్నావా అని ప్రశ్నిచారు. దాంతో నేను బైక్‌లో ఆడియో సిస్టం ఇన్‌బిల్ట్‌గా ఉంది. నేనేం మార్పులు చేయలేదు. ఇది బుల్లెట్‌ కాదు అని వివరించే ప్రయత్నం చేశాను. కానీ ఆ అధికారులు నా మాటలు పట్టించుకోలేదు. ఇది ఇల్లీగల్‌ బైక్‌.. దీన్ని నడపాలంటే పర్మిషన్‌ తీసుకోవాలని చెప్పారు. అప్పుడు నేను హార్లీ ఇండియా వెబ్‌సైట్‌లో బైక్‌కు సంబంధించిన వీడియో చూపించే ప్రయత్నం చేశాను. కానీ అది కూడా ఫలించలేదు. నన్ను చలానా కట్టాల్సిందిగా ఆదేశించారు’అన్నాడు.

‘ఇంతలో ఓ ట్రాఫిక్‌ అధికారి అక్కడకు వచ్చి సర్‌ ఈ బైక్‌కు అనుమతులున్నాయి. ఇది ఇల్లీగల్‌ కాదని నచ్చజేప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ అధికారులు అతడి మాట కూడా వినలేదు. చలానా కట్టాల్సిందే అన్నారు. నేను బండికి సంబంధించిన ప్రతి కాగితాన్ని వారికి చూపించాను. చలానా ఎందుకు కట్టాలని ప్రశ్నించాను. అందుకు వారు బైక్‌లో మ్యూజిక్‌ ప్లే చేసినందుకు అన్నారు. పోలీసులు నా బండి ఆపినప్పుడు నా బైక్‌లో నుంచి వస్తోన్న మ్యూజిక్‌ సౌండ్‌ కేవలం 30 శాతం మాత్రమే. దాంతో నేను బండిలో పెద్దగా మ్యూజిక్‌ ప్లే చేసి ఎవరికి ఇబ్బంది కలిగించలేదని స్పష్టం చేశాను. అప్పుడు అధికారులు నా బైక్‌ సౌండ్‌ పూర్తిగా పెంచి వీడియో తీసి ఇప్పుడు చలానా కట్టు అని ఆదేశించారు. నా బైక్‌కు సంబంధించి అన్ని పన్నులు చెల్లించాను. ట్రాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌ వారి నిబంధనల మేరకు అన్ని కాగితాలను చూపించడమే కాక.. అన్ని ట్రాఫిక్‌ నియమాలను పాటించాను. అయినా పోలీసులు నన్ను చలానా కట్టాలని ఆదేశించారు’ అంటూ వాపోయాడు రాఘవ్‌.

‘నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుందా.. మీరే చెప్పండి. ఏ నేరం చేయని నన్ను రెండు గంటల పాటు ఎండలో నిల్చోబెట్టి.. అమర్యాదగా ప్రవిర్తంచారు. ఇదెక్కడి న్యాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్న అంటే.. ఈ రోజు నాకు జరిగింది.. రేపు మీకు జరగవచ్చు. మనం ఒకిరికొకరం మద్దతిచ్చుకుని.. ఈ అన్యాయాన్ని ఎదిరించాల’ని చెప్పుకొచ్చాడు రాఘవ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్‌ ఫేస్‌బుక్‌లో తెగ వైరలవుతోంది. భారీ సంఖ్యలో నెటిజనులు రాఘవ్‌కు మద్దతు తెలుపుతున్నారు. మరి దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులతో పాటు, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top