‘లక్ష్మి’ ఆచూకీ దొరికింది

Delhi Last Elephant Lakshmi Rescued After Two Months - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కనిపించకుండా పోయిన ఏనుగు లక్ష్మి ఆచూకిని అటవీశాఖ అధికారులు 2 నెలల తరువాత కనుగొన్నారు. లక్ష్మిని దాచిపెట్టిన మావటిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఏనుగు, మావటి ఎక్కడున్నది ఆచూకి తీసి అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లు తూర్పు ఢిల్లీ డీసీపీ జస్మీత్‌ సింగ్‌ చెప్పారు. తూర్పు ఢిల్లీలోని చిల్లా గ్రామం దగ్గరనున్న యమునా ఖాదర్‌ ప్రాంతంలో ఏనుగును, మావటిని కనుగొన్నారు. ఏనుగు కేర్‌టేకర్‌ యూసఫ్‌ అలీ, అతని కుమారుడు షకీర్‌ ఇంకా పోలీసులకు చిక్కలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఏనుగుని తీసుకుని పారిపోయిన ముగ్గురిపై షాకుర్‌పుర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురు జులై6న లక్ష్మిని తీసుకుని పారిపోయారు. లక్ష్మి కోసం గాలించి అటవీశాఖ అధికారులు అలసిపోయారు. కానీ దానిని తమ కళ్లు గప్పి యమునా తీర మైదానాల్లో పొడవుగా పెరిగిన గడ్డి వెనుక దాచి ఉంచారని, ఏనుగును దాచిన ప్రదేశం తూర్పు ఢిల్లీ డీసీపీ కార్యాలయానికి దగ్గరలోనే ఉందని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

లక్ష్మి అలీతో పాటు నగరంలోనే ఉందని, దానిని యమునా తీరాన ఐటిఓ వద్ద దాచారన్న సమాచారాన్ని అలీ కుటుంబం అందించడంతో అ«ధికారులు సోమవారం నుంచి తమ గాలింపును ముమ్మరం చేశారు. 14 మంది అటవీశాఖ అధికారులతో కూడిన బృందం, మూడు పోలీసు బృందాలు మంగళవారం ఎనమిది గంటల పాటు గాలించి ఆఖరికి ఏనుగు ఆచూకి తెలుసుకున్నారు. ఢిల్లీలో ఏనుగులను మానవ నివాసాలకు దూరంగా తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశం మేరకు అటవీ శాఖ అధికారులు పునరావాసం కల్పించేందుకు లక్ష్మిని స్వాధీనపరచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చర్యను వ్యతిరేకిస్తోన్న అలీ కుటుంబం న్యాయస్థానంలో ముందస్తు బెయిలు కోసం దరఖాస్తు చేసింది. కానీ న్యాయస్థానం ఈ పిటిషన్‌ కొట్టివేసింది. తమ బెయిలు దరఖాస్తుపై తదుపరి విచారణ సెప్టెంబర్‌ 23న ఉందని అలీ చిన్న కుమారుడు షోయబ్‌ చెప్పారు. తన తండ్రి, సోదరులకు బెయిల్‌ లబించిన తరువాత లక్ష్మిని అందరి ఎదుట ఉంచుతామని అతను చెప్పాడు. ఏనుగు లక్ష్మి జూనోటిక్‌ వైరల్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top