టీనేజర్‌పై హత్యానేరం | Delhi hit-and-run case: Teenager charged with culpable homicide | Sakshi
Sakshi News home page

టీనేజర్‌పై హత్యానేరం

Apr 10 2016 10:20 AM | Updated on Aug 11 2018 9:10 PM

టీనేజర్‌పై హత్యానేరం - Sakshi

టీనేజర్‌పై హత్యానేరం

మెర్సిడెస్ బెంజ్ కారుతో ఢిల్లీ సివిల్ లైన్స్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై ఉద్దేశపూర్వకం కాని, శిక్షార్హమైన హత్యానేరం కింద కేసు నమోదైంది.

సాక్షి, న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కారుతో ఢిల్లీ సివిల్ లైన్స్‌లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఒక వ్యక్తి మరణానికి కారకుడైన 17 ఏళ్ల బాలుడిపై ఉద్దేశపూర్వకం కాని, శిక్షార్హమైన హత్యానేరం కింద కేసు నమోదైంది. ఆ బాలుడి గత డ్రైవింగ్ రికార్డు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు. నివాస ప్రాంతంలో విపరీతమైన వేగంతో ఆ బాలుడు కారు నడిపినట్లు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా స్పష్టమైందని డీసీపీ మాథుర్ వర్మ తెలిపారు. ఆ బాలుడు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇదేం తొలిసారి కాదని ఆయన తెలిపారు.

గతంలోనూ ప్రమాదాలు చేసిన చరిత్ర అతడికి ఉందన్నారు. 17 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇలాంటి కేసు మళ్లీ నమోదైందని, 1999లో సంజీవ్ నందా అనే వ్యక్తి బీఎండబ్ల్యూ కారుతో ఢీకొట్టడం వల్ల ఆరుగురు మృతి చెందారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. హీరో సల్మాన్ ఖాన్ విషయంలోనూ పోలీసులు ఇలాంటి చర్యలే తీసుకున్నారు. కాగా, వ్యాపారస్తుడైన బాలుడి తండ్రిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

మైనరా...? కాదా..?
ఇదిలా ఉండగా మెర్సిడెస్ నడిపిన నిందితుడు నిజంగా మైనరేనా కాదా అన్నది నిర్ధారించుకోవడం కోసం పోలీసులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారు. నిందితుడిని జువనైల్‌గా చూపిస్తూ అతడి కుటుంబం సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు నిజమైనవా కాదా అన్న విషయాన్ని వారు తనిఖీ చేస్తున్నట్లు తెలిసింది. నిందితుడు దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు పోలీసులు అతని పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు.

తొలుత మంగళవారం బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఆ తరువాత విడిచిపెట్టారు. బాలుడి తండ్రిని శనివారం న్యాయస్థానం ఎదుట హాజరు పరిచారు. మితిమీరిన వేగంతో తన కుమారుడు వాహనం నడుపుతున్నాడని తెలిసినప్పటికీ అతని తండ్రి నిందితుడిని అదుపు చేయలేదని పోలీసులు ఆరోపించారు. వేగంగా వాహనం నడిపే కొడుకు చేతికి కారు ఇచ్చి తండ్రి మనోజ్ అగర్వాల్ నేరాన్ని ప్రోత్సహించాడని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement