అడుక్కోవడం నేరమెలా అవుతుంది: హైకోర్టు

Delhi High Court Says Begging Is No More A Criminal Offence - Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో యాచించడం నేరం కాదంటూ తీర్పునిచ్చింది ఢిల్లీ హైకోర్టు. ​ప్రజలకు కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ కల్పించడంలో వైఫల్యం చెందిన ప్రభుత్వం అడుక్కోవడాన్ని నేరం అని ఎలా అంటుందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక యాచకులపై జరిమానాలు విధించడం రాజ్యంగ విరుద్ధమని ప్రకటించింది. ‘ఢిల్లీలో అడుక్కోవడాన్ని నేరంగా పరిగణించడానికి బదులుగా యాచకులకు కనీస ప్రాథమిక హక్కులు కల్పించాలం’టూ ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. కర్ణిక సావ్నీ, హర్ష మందర్‌ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

‘అడుక్కోవాలని ఎవరూ అనుకోరు. మనిషి ప్రాథమిక అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా మరొకరిని యాచించాల్సి వస్తోంది. ప్రజలకు ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలు యాచించడాన్ని నేరంగా ఎలా పరిగణిస్తాయ’ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గీతా మిత్తల్‌, జస్టిస్‌ సి.హరి శంకర్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. అంతేకాక పిల్లల చేత బలవంతంగా అడుక్కునేలా చేస్తున్న ముఠాలను అరికట్టేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నయ చట్టాన్ని తీసుకురావాలని  ఆదేశించింది.

‘బాంబే ప్రివెన్షన్‌ ఆఫ్ బెగ్గింగ్‌ యాక్ట్‌’ ప్రకారం అడుక్కోవడం నేరం. దీన్ని సవాలు చేస్తూ పిటిషన్‌దారులు కోర్టును ఆశ్రయించారు. అయితే పేదరికం కారణంగా యాచించడం నేరం కాదని గతంలోనే ప్రభుత్వం కూడా వెల్లడించింది. ప్రస్తుతానికి అడుక్కోవడాన్ని నిషేధించే కేంద్ర చట్టాలు ఏమి లేవు. అయితే చాలా రాష్ట్రాలు బాంబే చట్టాన్నే పరిగణలోకి తీసుకొని, యాచించడాన్ని నేరంగా పరిగణిస్తూ తమ రాష్ట్ర చట్టాల్లో మార్పులు చేస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం మొదటిసారి యాచిస్తూ పట్టుబడితే మూడేళ్ల కంటే ఎక్కువ శిక్ష ఉంటుంది. మళ్లీ అలాగే చేస్తే పదేళ్ల దాకా శిక్ష పడే అవకాశం ఉంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top