సైబర్‌దాడులు ప్రధాన ముప్పు

Cyber attacks are a significant threat: Modi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  సురక్షితమైన సైబర్‌ స్పేస్‌  జీవిత నాణ్యతను మెరుగుపరుస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ  వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్‌ సేవల  అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనిమోదీ తెలిపారు. ఢిల్లీలో  అతిపెద్ద గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ సైబర్‌ స్పేస్‌ను  గురువారం  ప్రారంభించిన ప్రధాని సైబర్‌ దాడులు తీవ్రమైన ముప్పుగా పరిణమించాయని వ్యాఖ్యానించారు. డిజిటల్ యాక్సెస్ ద్వారా ప్రభుత్వం సాధికారతకు కట్టుబడి ఉందని చెప్పారు.  డిజిటల్ టెక్నాలజీ ద్వారా సేవలు సమర్థవంతంగా మారాయనీ, చాలా సులువుగా ప్రజలకు సేవలు అందించడంలో డిజిటల్ టెక్నాలజీ కీలకంగా మారిందన్నారు. టెక్నాలజీ వల్లే నగదు రహిత లావాదేవీలు పెరిగాయన్నారు. భీమ్ యాప్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని క్రియేట్ చేస్తున్నామన్నారు. ఎం పవర్‌(మొబైల్ పవర్) ద్వారా పౌరులు సాధికారత సాధిస్తున్నారని మోదీ  పేర్కొన్నారు.  అంతేకాదు ఆధార్ ద్వారా సబ్సిడీల  లక్ష్యాన్ని  ఛేదించడంతోపాటు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొదుపు చేయగలిగామన్నారు.

సైబర్‌స్పేస్‌లో పెట్టుబడుల ద్వారా ప్రగతిలో భాగస్వామ్యం కావాలని ప్రధాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లు సైబర్‌స్పేస్‌కు సహకరిస్తున్నాయన్నారు. ఇంటర్నెట్ ఒక ఐడియల్ ఫ్లాట్‌ఫామ్‌గా మారిందన్నారు. ఇంటర్నెట్ ఆధారంగా యువత తమ టాలెంట్‌ను ప్రదర్శిస్తున్నారన్నారు. సైబర్‌భద్రతపై పటిష్టమైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సాధారణ పౌరుడికి కూడా సైబర్‌భద్రత ఉండాలన్నారు. స్టార్టప్‌ల ద్వారా రోజు వారీ సమస్యలకు సమాధానాలు దొరుకుతున్నాయన్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉగ్రవాదులకు ఊతమివ్వకుండా చూసుకోవాలని,  రైతులకు ఉపయోగకరంగా ఉండే సైబర్ టెక్నాలజీని రూపొందించాలన్నారు.

సైబర్‌ ఫర్‌ ఆల్ ఎ సెక్యూర్ అండ్ ఇన్‌క్లూజివ్ సైబర్‌స్పేస్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్‌మెంట్ నినాదంతో నిర‍్వహిస్తున్నఅయిదవ  అంతర్జాతీయ సదస్సు  రెండు రోజుల పాటు  జరగనుంది.  ఈ సందర్బంగా  ద ఇండియా బుక్‌ను ప్రధాని మోదీ  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని ఈజ్ ఆఫ్ లీవింగ్ కోసం డిజిటల్ టెక్నాలజీ చాలా ఉపయోగకరంగా మారిందన్నారు. టెక్నాలజీ వల్ల సుపరిపాలన కూడా సాధ్యమైందన్నారు. టెక్నాలజీ అన్ని అవరోధాలను అధిగమించిందన్నారు. వసుధైక కుటుంబం అన్న భారతీయ సనాతన ధర్మాన్ని డిజిటల్ టెక్నాలజీ నిరూపిస్తుందన్నారు. పెన్షనర్లు బ్యాంక్ ముందు నిలబడాల్సిన అవసరం లేదని, ఆధార్‌తో తమ జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు అన్నారు. డిజిటల్ టెక్నాలజీ  వృద్ధి మూలంగా మహిళలు పారిశ్రామికవేత్తలుగా అవతరిస్తున్నారని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top