కరోనా ఎఫెక్ట్‌: ‘ఈ-పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌’

CRPF Conduct Passing Out Ceremony Via Video Conference - Sakshi

గురుగ్రామ్‌: కరోనా మహమ్మారి విజృంభణతో యావత్‌ ప్రపంచంతో పాటు దేశవ్యాప్తంగా పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్‌డౌన్‌తో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసర సేవలు అందిస్తున్న వైద్య, పోలీసు సిబ్బంది మాత్రమే ప్రత్యక్ష విధుల్లో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పాలకులంతా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్‌ తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘ఈ-పాసింగ్‌ అవుట్ పరేడ్’‌‌ నిర్వహించింది. 

నేరుగా గెజిటెడ్‌ అధికారులుగా నియమితులైన 51వ బ్యాచ్‌కు చెందిన 42 మంది అధికారుల కోసం కాదర్పూర్‌ సీఆర్‌పీఎఫ్‌ అకాడమీలో ఈ-పాసింగ్‌ అవుట్ పరేడ్‌‌ నిర్వహించారు. ఈ 42 మంది అధికారులు యూనిఫామ్‌తో పాటు ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లోవ్స్‌ ధరించి ఈ-పాసింగ్‌ అవుట్‌లో పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి కేంద్ర హెంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి, డీజీ ఏపీ మహేశ్వరి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 81 ఏళ్ల సీఆర్‌పీఎఫ్‌ చరిత్రలో ఈ-పాసింగ్‌ అవుట్‌ నిర్వహిచడం ఇదే మొటిసారి. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వెబ్‌ లింక్‌ను తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు షేర్‌ చేశారు.

ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ 42 మంది అధికారుల సేవలు ఎంతో అవసరం కావడంతో ఈ-పాసింగ్‌ అవుట్ పరేడ్‌‌ నిర్వహించాల్సి వచ్చిందని సీఆర్‌పీఎఫ్‌ పీఆర్‌ఓ డీఐజీ మెసెస్‌ దినకరన్‌ తెలిపారు. కరోనా కారణంగా  అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. ఈ-పాసింగ్‌ అవుట్‌ను  పలువురు నెటిజనులు ప్రశంసించారు. 

 

కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top