బిహార్‌లో ముదిరిన సంక్షోభం! | Sakshi
Sakshi News home page

బిహార్‌లో ముదిరిన సంక్షోభం!

Published Mon, Feb 9 2015 12:42 AM

బిహార్‌లో ముదిరిన సంక్షోభం! - Sakshi

  • గద్దె దిగేందుకు సీఎం మాంఝీ ససేమిరా
  • అసెంబ్లీలో బలం నిరూపించుకుంటానని వెల్లడి
  • ప్రధాని మోదీతో భేటీ.. బీజేపీ మద్దతిస్తే ఆహ్వానిస్తానని వ్యాఖ్య
  • నితీశ్‌ది అధికార దాహమని మండిపాటు
  • తమకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న నితీశ్ వర్గం
  • పట్నా/న్యూఢిల్లీ: బిహార్ రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. అటు సీఎం జితన్ రాం మాంఝీ మెట్టు దిగడం లేదు. ఇటు జేడీయూ నాయకత్వం పట్టు వీడడం లేదు. అసెంబ్లీలో బలం నిరూపించుకొని తీరుతానంటూ సవాలు విసిరిన  మాంఝీ.. ఆదివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అంతకుముందు పట్నాలో జేడీయూ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లి నితీశ్‌కు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.

    మరోవైపు అసెంబ్లీ స్పీకర్ ఉదయ్ నారాయణ్ చౌదరి.. జేడీయూ శాసనసభాపక్ష(ఎల్పీ) కొత్త నేతగా నితీశ్‌కుమార్‌ను గుర్తించారు.  మాంఝీని మాజీ ఎల్పీ నేతగా పేర్కొంటూ స్పీకర్ కార్యాలయం రాజ్‌భవన్‌కు లేఖను పంపింది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నితీశ్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠీని కలవనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో  మాంఝీకి బీజేపీ దన్నుగా నిలబడుతుందా? మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున నితిశ్ సీఎం పగ్గాలు చేపడతారా? లేదా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక కొత్త సీఎం కోసం ఎన్నికలు జరుగుతాయా? సోమవారం పశ్చిమబెంగాల్ నుంచి గవర్నర్ త్రిపాఠీ బిహార్‌కు వచ్చిన తర్వాత ఈ కీలక ప్రశ్నలకు సమాధానం దొరకనుంది. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్నదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది! కాగా, శనివారం తమ పదవులు వీడిన 20 మంది మంత్రుల(నితీశ్‌వర్గం) రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు.
     
    ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: నితీశ్ వర్గం

    జేడీయూ, దాని మిత్రపక్షాలకు కలిపి 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరంతా నితీశ్ వెంట నిలిచినందున ఆయనను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేడీయూ ప్రతినిధి బృందం రాజ్‌భవన్ అధికారులకు విన్నవించింది. ఈ మేరకు ఆదివారం  జేడీయూ రాష్ట్ర  చీఫ్  వశిష్ట నారాయణ్‌సింగ్ నేతృత్వంలో నాయకులు రాజ్‌భవన్ అధికారులకు నితీశ్‌కు మద్దతిస్తున్నవారి పేర్లతో కూడిన లేఖను అందజేశారు. సోమవారం ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాల్సిందిగా నితీశ్ స్వయంగా వెళ్లి గవర్నర్‌ను కోరతారని నారాయణ్‌సింగ్ తెలిపారు.

    జేడీయూ ఎల్పీ నేతగా  మాంఝీని తప్పిస్తూ నితీశ్‌ను ఎన్నుకున్నట్లు పార్టీ అధినేత శరద్ యాదవ్ రాసిన లేఖను అధికారులకు అందజేశామన్నారు. నారాయణ్‌సింగ్ వెంట ఆర్జేడీ, కాంగ్రెస్ ఎల్పీ నేతలు సిద్ధిఖీ, సదానంద్ సింగ్, సీపీఐ నేత జితేంద్ర నారాయణ్, స్వతంత్ర ఎమ్మెల్యే దులాల్ ఉన్నారు. బెంగాల్ గవర్నర్‌గా ఉన్న త్రిపాఠీబిహార్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చూస్తున్నారు. సోమవారం ఉదయమే పట్నా చేరుకుంటానని చెప్పారు.
     
    మెజారిటీ నిరూపించుకుంటా: మాంఝీ


    అసెంబ్లీలో తాను బలం నిరూపించుకుంటానని మాంఝీ స్పష్టంచేశారు. అప్పటిదాకా రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు. నితీశ్ అధికారదాహంతో తహతహలాడుతున్నారని మండిపడ్డారు. దళితుడిని అయినందుకే తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో మోదీతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనకు బీజేపీ మద్దతిస్తే తప్పకుండా ఆహ్వానిస్తానన్నారు. మోదీతో రాజకీయ అంశాలపై మాట్లాడలేదని చెప్పారు.  

    ‘‘జేడీయూ ఎల్పీ నేతగా నితీశ్‌ను ఎన్నుకోవడం చట్ట వ్యతిరేకం. బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలుపుతూ ఇప్పటికే గవర్నర్‌కు లేఖ రాశా. ఈనెల 19 లేదా 20న అసెంబ్లీలో బలం నిరూపించుకుంటా. నితీశ్‌కు తగినంత మంది మద్దతు ఉంటే ఎందుకు బాధపడుతున్నారు. ఒకవేళ వాళ్లు బలం నిరూపించుకుంటే  గద్దె దిగి పోతా’’ అని చెప్పారు. పార్టీకి చెందిన 111 మంది ఎమ్మెల్యేలలో 97 మంది నితీశ్‌కు మద్దతిస్తున్నారు కదా, మీవైపు ఎందరున్నారని అడగ్గా.. సమయం వచ్చినప్పుడు తనవైపు ఎందరు నిలబడతారన్నదే కీలకమన్నారు.  

    రబ్బరు స్టాంపుగా ఉండి నితీశ్‌కు అణిగిమణిగి ఉన్నంత వరకూ సంతోషంగా ఉన్నారని, తనలో ఆత్మగౌరవం మేల్కొని స్వతంత్రంగా ప్రవర్తించేసరికి పదవి నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. ఆయన మంచివారే కానీ, పదవి లేకపోతే బతకలేరని విమర్శించారు. తనలాంటి దళితనేతలు నోరెత్తే సాహసం చేస్తే వారిని చంపడమో లేదా పక్కకు తప్పించడమో చేశారని, అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయానన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతానని, కొత్తగా 16-17 మందిని తీసుకుంటానని చెప్పారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమిస్తానని, వారిలో ఒకరు ముస్లిం ఉంటారని అన్నారు.
     
    మాంఝీకి మతి భ్రమించింది: శ్రావణ్

    మాంఝీ వెంట 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అయినా మంత్రివర్గాన్ని విస్తరించి 17 మందికి చోటు కల్పిస్తానని చెప్పడం ఆయన మానసిక పరిస్థితిని తెలుపుతోందని జేడీయూ నేత, నితీశ్ మద్దతుదారు శ్రావణ్‌కుమార్ ఎద్దేవా చేశారు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మాంఝీ రాజీనామా చేయాలని సూచించారు. తమ పార్టీలో సం క్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి ఆరోపించగా.. నితీశ్ అధికార దాహం వల్లే వారి పార్టీ సంక్షోభంలో మునిగిపోయిందని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
 
Advertisement