నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి లాక్‌డౌన్‌ 3.0

Published Mon, May 4 2020 4:20 AM

COVID-19: India is set to enter its third phase of lockdown - Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్‌డౌన్‌ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్‌ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్‌ జోన్లు, ఆరెంజ్‌ 284, గ్రీన్‌ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్‌ జోన్లు ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా నిషేధం కొనసాగేవి.. విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్‌ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు.    

ఆ మినహాయింపు వలస కార్మికులకే
లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ వెసులుబాటు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పని ప్రదేశాల నుంచి గానీ, సొంతూళ్ల నుంచి గానీ వచ్చి..లాక్‌డౌన్‌ కారణంగా తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసమే ప్రభుత్వం మినహాయింపు కల్పించిందని తెలిపారు. అంతేతప్ప, సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి వర్తించదని స్పష్టత నిచ్చారు. (నేటి నుంచి.. లాక్‌డౌన్‌ సడలింపులు)

Advertisement
Advertisement