కరోనా: మన దేశంలో ఎందుకిలా? | Coronavirus: India Slowest to Reach Three Lakh Cases | Sakshi
Sakshi News home page

కరోనా కేసులు: 134 రోజుల్లో 3 లక్షలు

Jun 13 2020 1:10 PM | Updated on Jun 13 2020 4:08 PM

Coronavirus: India Slowest to Reach Three Lakh Cases - Sakshi

3 లక్షల మార్క్‌ను చేరడానికి  కేవలం 10 రోజులు మాత్రమే పట్టిందంటే కరోనా విజృంభణను అర్థం చేసుకోవచ్చు.

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ అప్రతిహతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నాటికి దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3 లక్షల మైలురాయిని దాటింది. ఈ సంఖ్యను చేరుకోవడానికి భారత్‌కు 134 రోజుల సమయం పట్టింది. కరోనా కేసుల్లో మన కంటే ముందున్న దేశాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువగా సమయంగా తెలు​స్తోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,08,993కి చేరగా, మృత్యుల సంఖ్య 8884కి పెరిగింది. 1,54,330 మంది కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్నారు. 

అత్యధికంగా కోవిడ్‌-19 బారిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత భారత్‌ నాలుగో స్థానంలో ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో 3 లక్షల కరోనా కేసులు నమోదు కావడానికి కేవలం 73 రోజులే పట్టింది. బ్రెజిల్‌ 85, రష్యా 109 రోజుల్లో 3 లక్షల మైలురాయిని దాటాయి. అయితే ఈ మూడు దేశాల మొత్తం జనాభా.. భారతదేశ జనాభాలో దాదాపు సగమే మాత్రమే. భారత్‌తో పోల్చుకుంటే అమెరికా, బ్రెజిల్, రష్యాలు అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాయన్న విషయం గమనించాలి.

టెస్ట్‌ల్లో వెనుకంజ
టాప్‌-10 కరోనా బాధిత దేశాల్లో ప్రతి 10 లక్షల మంది జనాభాకు జరుగుతున్న కోవిడ్‌ పరీక్షలను పరిశీలిస్తే భారత్‌ చాలా వెనుకబడి ఉందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం సమాచారం ప్రకారం పది లక్షల జనాభాకు కరోనా పరీక్షల ఆల్-టైమ్ సగటు ఒకటి మాత్రమే. ప్రస్తుతం దేశంలో రోజుకు 1.5 లక్షల పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరు వారాల క్రితం వరకు కేవలం 10 నుంచి 20 వేల వరకు మాత్రమే కోవిడ్‌ టెస్ట్‌లు చేశారు. (కరోనా విరుగుడుకు బీసీజీ, పోలియో టీకాలు)

జాగ్రత్త పడండి

జనవరి 30న భారత్‌ మొదటి కరోనా కేసు వెలుగులోకి రాగా, మే 18 నాటికి లక్ష మార్క్‌ చేరుకుంది. అంటే 109 రోజుల సమయం పట్టింది. తర్వాత రెండు వారాలకే కోవిడ్‌ కేసులు 2 లక్షలు దాటేశాయి. అక్కడి నుంచి 3 లక్షల మార్క్‌ను చేరడానికి  కేవలం 10 రోజులు మాత్రమే పట్టిందంటే కరోనా విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ సడలించినప్పటి నుంచి రోజుకు 8 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే భారత్‌ కంటే ముందున్న మూడు దేశాలతో పోల్చుకుంటే పరిస్థితి మెరుగ్గానే అనిపిస్తోంది. అయితే ఇప్పుడే భారత్‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్చి 25 నుంచి దాదాపు రెండు నెలలు పూర్తిగా లాక్‌డౌన్‌ అమలు చేయడంతో ఆ సమయంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందని, లాక్‌డౌన్‌ ఎత్తివేసిన నేపథ్యంలో ఇప్పుడు కోవిడ్‌ కేసులు వేగంగా పెరుగుతున్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. (లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: 18.5 లక్షల అబార్షన్లు

మెరుగవుతున్న పరిస్థితి
భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి పెరుగుతుండటం ఊరట కలిగిస్తోంది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేసింది. తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన (మార్చి 25న) సమయంలో కరోనా కేసులు కేవలం 3.4 రోజుల్లో రెండింతలు అయ్యాయని గుర్తుచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 53,63,445 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) తెలిపింది. (కరోనా విజృంభణ: 3 లక్షలు దాటిన కేసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement