కరోనా అప్‌డేట్‌: 118కి చేరిన కేసుల సంఖ్య

Corona Update: Most Of Cases Rising From Maharashtra - Sakshi

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకు అధికమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 118కి పెరిగింది. కాగా ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో మహారాష్ట్రకు చెందినవే అధికంగా ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా మరో నలుగురికి కరోనా సోకడంతో ఇప్పటి వరకు 38 కేసులు నమోదు అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్‌ బోర్డు సభ్యులు ప్రకటించారు. అధిక సంఖ్యలో భక్తులు సందర్శించుకునే ఆలయంగా ఈ దేవాలయం ప్రాచుర్యం పొందింది. కాగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆలయం మూసివేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఆలయ వైద్య ఆరోగ్య కేంద్రం తెరిచే ఉంటుందని తెలిపారు. (కరోనా: సుప్రీంకోర్టు మరో కీలక నిర్ణయం!)

మరోవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర సీఎం ప్రకటించారు. అలాగే ఒడిశాలో సోమవారం తొలి కరోనా కేసు నమోదైంది. ఇటీవల ఇటలీ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా ఢిల్లీలోని జేఎన్‌యూ యూనివర్సిటీ విద్యార్థులను ఇంటికి వెళ్లాల్సిందిగా యూనివర్సిటీ అధికారులు సూచించారు. ఇరాన్‌ నుంచి 53 మంది భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చారు. వారిని జైసల్మేర్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా 135 దేశాలలో 1,53,517 మంది కరోనా బారిన పడగా.. 5,700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. (కరోనా ఎఫెక్ట్‌: రానా ‘అరణ్య’ విడుదల వాయిదా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top