‘సీబీఐని నీరుగార్చిన మోదీ’

Congress Party Has Blamed The Modi Govt For Systemic Dismantling Of The CBI - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మోదీ సర్కార్‌ సీబీఐ ప్రతిష్టను, విశ్వసనీయతను దెబ్బతీస్తోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. దర్యాప్తు ఏజెన్సీలో సంక్షోభానికి నరేంద్ర మోదీ సర్కార్‌ బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని మోదీ సర్కార్‌ నీరుగార్చిందని, వ్యూహాత్మకంగా దర్యాప్తు ఏజెన్సీని ధ్వంసం చేసిందని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జీవాలా అన్నారు. ప్రతిష్టాత్మక దర్యాప్తు ఏజెన్సీ విశ్వసనీయత, సమగ్రత, స్వతంత్రతలను ప్రధాని మోదీ నాశనం చేశారని వరుస ట్వీట్లలో ఆరోపించారు. సీబీఐలో అనారోగ్యకర పరిస్థితికి బీజేపీ ప్రభుత్వమే కారణమని అన్నారు.రాజకీయ ప్రయోజనాల కోసం సీబీఐని దుర్వినియోగం చేయడంతో సీరియస్‌ క్రిమినల్‌ కేసుల్లో పారదర్శకమైన దర్యాప్తు కొరవడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

సీబీఐ డైరెక్టర్‌ను తొలగించడంలో ప్రధాని నరేంద్ర మోదీ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ పనితీరులో ప్రధాని నేరుగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. సీబీఐ, రా ఉన్నతాధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పారదర్శకంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సీబీఐ ఉన్నతాధికారులపై వచ్చిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరిపించాల్సి ఉండగా, వారిని కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మొత్తం వ్యవహారంలో ప్రధాని పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయని సుర్జీవాలా అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top