
మోదీ తీరుతో ముగ్ధుడినయ్యా: శశి థరూర్
తన భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..
కోల్‌కతా: తన భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. తాను లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మోదీ తనను అభినందించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని, అప్పటి వరకూ తమ మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని మరచిపోయి ఆయన తనను అభినందించడం తనను ముగ్ధ్దుడ్ని చేసిందని థరూర్ పేర్కొన్నారు. శుక్రవారం కోల్‌కతాలో అపీజే కోల్‌కతా లిటరరీ ఫెస్టివల్ సందర్భంగా తాను రచించిన ‘ఇండియా శాస్త్ర’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు సిమ్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ తన భార్య సునందను ఉద్దేశించి రూ. 50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అంటూ విమర్శలు చేశారని, దీనిపై తమ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగిందని, ఆ సమయంలో మోదీ తనను అభినందిస్తారని అసలు తాను భావించలేదని చెప్పారు. అయితే సునంద హత్య కేసుకు సంబంధించి ప్రశ్నలకు థరూర్ సమాధానం ఇవ్వలేదు. ఈ కేసులో మీడియా వ్యవహరిస్తున్న తీరు బాధ్యతారహితమన్నారు. కాగా, పార్టీ వైఖరికి వ్యతిరేకంగా మోదీని థరూర్ ప్రశంసించడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది.
మరింత మందిని ప్రశ్నిస్తాం...
సునంద హత్య కేసులో రెండు రోజుల్లో మరింత మందిని ప్రశ్నిస్తామని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు వేగంగా సాగుతోందని, సాధ్యమైనంత త్వరగా కేసు విచారణను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కేసు విచారణలో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. విచారణలో తాము జోక్యం చేసుకోవడం లేదన్నారు.