భూగోళం మంటల్లో భారత్‌ భవిష్యత్‌

Climate change will worsen Indias farm crisis - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో ఓ పక్క వరదల బీభత్సం... ఇల్లూ కొట్టాలు కొట్టుకుపోయి అపార మనుషులు, పశువుల ప్రాణ నష్టం. కళ్ల ముందు కూలుతున్న ఎత్తైన మేడలు, రోడ్డు వంతెనలు,  మరో పక్క కరువు కాటకాల భీకర రూపం... ఎండిపోయిన చేన్లు, చిక్కి శల్యమయ్యే మానవ దేహాలు. అన్నార్తుల ఆకలి కేకలు. ఎటు చూసిన జంతు కళేబరాల సాక్షత్కారం’ ఇది ఏ సినిమా కథకాదు. భోగోళం వేడిక్కుతుండడం వల్ల ముంచుకొస్తున్న ప్రళయం. 2,100 సంవత్సరం నాటి భూగోళం ఉష్ణోగ్రత మూడు డిగ్రీలు పెరుగుతుందని ‘క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌ (మూడు పరిశోధన సంస్థల సంయుక్త సంస్థ)’ హెచ్చరించింది. భూగోళం ఉష్ణోగ్రత 2,100 సంవత్సరానికి 1.5 డిగ్రీల పెరుగుదలకే పరిమితం చేయాలంటూ 2015లో ప్రపంచ దేశాలు చేసుకున్న పారిస్‌ అగ్రిమెంట్‌ కన్నా రెండింతలు ఎక్కువగా ఉష్ణోగ్రత పెరుగుతోందట.

ఇందుకు కారణం ప్రపంచంలో ఎక్కువ కర్బన ఉద్గారాల విడుదలకు కారణమవుతున్న పది దేశాల్లో భారత్, కెనడా మినహా ఏ దేశాలు సరైన నిరోధక చర్యలు తీసుకోకపోవడమేనని క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌ వెల్లడించింది. ఇప్పుడు ఎంత కఠిన చర్యలు తీసుకొన్నా పూర్వ పరిస్థితి రాదని, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగక తప్పని పరిస్థితి కనిపిస్తోందని తెలిపింది. అమెరికా, బ్రిటన్‌  లాంటి అగ్ర రాజ్యాలు సరైన నిరోధక చర్యలను తీసుకోక పోవడం వల్ల 2017లో భూగోళంపై కార్బన్‌ డైయాక్సైడ్‌ బాగా పెరిగిందని, మళ్లీ పూర్వ పరిస్థితికి చేరుకునే ఆస్కారమే లేదని ఐక్యరాజ్య సమితి పర్యావరణ విభాగం ‘ఎమిషన్స్‌ గ్యాప్‌ రిపోర్ట్‌’లో వెల్లడించింది. ఫలితంగానే ఆ సంవత్సరం అకాల వరదలు, కరవు కాటకాల వల్ల 2,726 మంది మరణించారని ఢిల్లీలోని వాతావరణ పరిశోధన సంస్థ ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ తెలియజేసింది.  

హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో పెను ముప్పు

భూగోళం ఉష్ణోగ్రత మూడు డిగ్రీల సెల్సియస్‌ పెరిగితే ప్రపంచంలో ఎక్కువగా నష్టపోయే దేశాల్లో భారత్‌ 14వ స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ‘సౌత్‌ ఆసియా హాట్‌స్పాట్స్‌: ఇంపాక్ట్‌ ఆఫ్‌ టెంపరేచర్‌ అండ్‌ పర్సిపటేషన్‌ చేంజస్‌ ఆప్‌ లివింగ్‌ స్టాండర్డ్స్‌’ నివేదికలో వివరించింది. భారత్‌లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ముఖ్య హాట్‌స్పాట్‌లని, ఆ తర్వాత రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రాలు ఉన్నాయని ఆ నివేదిక పేర్కొంది. హాట్‌ స్పాట్‌ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉంటాయని, ఓ ప్రాంతంలో అధిక వర్షాలు పడితే మరోపక్క కరువు పరిస్థిలు తాండవిస్తాయని తెలిపింది. 2050 సంవత్సరం నాటికి భారత్‌లోని 120 కోట్ల జనాభాలో 44.8 శాతం మందిపై వేడెక్కుతున్న భోగోళం ప్రభావం ఉంటుంది అంచనా వేసింది.

తగ్గనున్న పంట దిగుబడులు

వర్షాధార ప్రాంతాల్లో ఒక సెంటిగ్రేడ్‌ ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఖరీఫ్‌ పంట దిగుబడి 6.2 శాతం, రబీ పంట దిగుబడి ఆరు శాతం తగ్గిపోతుందని ‘క్లైమేట్‌ ట్రెండ్స్‌’ వెల్లడించింది. ఇక సాధారణ వర్షాలకన్నా ప్రతి వంద మిల్లీ మీటర్ల వర్షానికి ఖరీఫ్‌లో 15 శాతం, రబీలో ఏడు శాతం తగ్గుతుందని తెలిపింది. భూగోళం ఉష్ణ ప్రభావం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపై, మధ్యతరగతి, పేదలు, నిరుపేదలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా రైతులు ఎక్కువగా దెబ్బతింటారని తెలిపింది. దేశంలోని 40 శాతం ప్రజలపై 2030 నాటికే ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పింది. పంటలు దెబ్బతినడం వల్ల వాటి ధరలు పెరగడం, కొనుగోలు శక్తి పడిపోయి పేదలు వాటిని కొనలేక పస్తులుండే పరిస్థితి తప్పదని హెచ్చరించింది. పేదలపై ప్రభావం 11 శాతం, ధనవంతులపై మూడు శాతం ఉంటుందని, పర్యావసానంగా ధనికులు, పేదవారి మధ్య వ్యత్యాసం మరింత పెరుగుతుందని ›క్లైమేట్‌ ట్రెండ్స్‌ హెచ్చరించింది.

ఈ పరిస్థితులను నివారించేందుకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యాన పోలండ్‌లోని కాటోవైస్‌ నగరంలో ఈ డిసెంబర్‌ 16వ తేదీన ముగిసిన సదస్సుకు ఐరోపా కూటమితోపాటు 196 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. 2020 నాటికి అమలు చేయాల్సిన మార్గదర్శకాలతో కూడిన  ఒప్పందం ‘కాటోవైస్‌ క్లైమేట్‌ ప్యాకేజ్‌’పై దాదాపు అన్ని దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top