తల్లి హత్య; ఏసీపీ ఔదార్యం

Chennai Police Adopts Boy The Son Of Murder Victim - Sakshi

సాక్షి, చెన్నై : నేరస్తుల పట్ల కఠినంగా ప్రవర్తించడమే కాదు.. ఆదరణ కరువైన వారిని ఆదుకునే సున్నితమైన మనస్తత్వం కూడా పోలీసుల సొంతమని నిరూపించారు చెన్నైకి చెందిన ఏసీపీ బాలమురుగన్‌. తల్లిని కోల్పోయిన ఓ పన్నెండేళ్ల బాలుడిని దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చి.. పెద్ద మనసు చాటుకున్నారు. అసలేం జరిగిందంటే... తమిళనాడుకు చెందిన పరిమళ ఓ నిరుపేద మహిళ. ఆమె కుమారుడు కార్తిక్‌ మైలపూర్‌లోని ఓ పాఠశాలలోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి తల్లి దగ్గర కొన్ని రోజులు ఉండేవాడు. ఈ క్రమంలో... పొరుగింటి వారితో పరిమళ గొడవ పడింది. దీంతో కోపోద్రిక్తుడైన పక్కింటి యజమాని సూర్య.. మూడు రోజుల క్రితం పరిమళను హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పరిమళ కొడుకు గురించి తెలుసుకున్న ఏసీపీ బాలమురుగన్‌.. అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. తల్లి హత్య విషయం చెప్పి... అతడిని ఓదార్చారు.

దత్తత తీసుకునేందుకు నిర్ణయించుకుని..
తల్లి మరణించడంతో అనాథగా మారిన కార్తిక్‌ పరిస్థితి చూసి చలించిపోయిన బాలమురుగన్‌.. అతడికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. కార్తిక్‌ చదుకునే పాఠశాలకు వెళ్లి.. అతడి చదువుకయ్యే ఖర్చును తానే భరిస్తానని చెప్పారు. కానీ కేవలం ఆర్థిక సాయం మాత్రమే కార్తిక్‌కు ఓదార్పు కాదని.. అతడికి ఓ కుటుంబం ఉంటే బాగుంటుందని ఆలోచించారు. తన భార్య కళా రాణితో ఈ విషయం గురించి చర్చించారు. ఈ క్రమంలో ఏసీపీ దంపతులు.. కార్తిక్‌ను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన లీగల్‌ ప్రొసీడింగ్‌ను ప్రారంభించారు.

పగ, ప్రతీకారాలకు అతడు దూరంగా ఉండాలి..
‘తల్లి హత్యకు గురికావడంతో కార్తిక్‌ అనాథ అయ్యాడు. తన పరిస్థితి ఇలా కావడానికి పక్కింటి వ్యక్తే కారణమని.. అతడిపై పగ తీర్చుకోవాలని.. కార్తిక్‌ భావించే అవకాశం ఉంది. తను ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. అతడిని సన్మార్గంలో నడిపించాలనుకున్నాను. అందుకే నా భార్యతో కలిసి చర్చించి... కార్తిక్‌ను దత్తత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. నా ఇద్దరు పిల్లలతో పాటుగా అతడికి విద్యాబుద్ధులు నేర్పిస్తానని’ బాలమురుగన్‌ వ్యాఖ్యానించారు. కాగా మానవత్వం చాటుకున్న బాలమురుగన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top