మక్కీకి మక్కీ ఐఫోన్‌లా.. 'ఫ్రీడం 251'! | Sakshi
Sakshi News home page

మక్కీకి మక్కీ ఐఫోన్‌లా.. 'ఫ్రీడం 251'!

Published Thu, Feb 18 2016 9:50 AM

మక్కీకి మక్కీ ఐఫోన్‌లా.. 'ఫ్రీడం 251'! - Sakshi

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా 'ఫ్రీడం 251' దుమారం రేపుతోంది. నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ కంపెనీ ఈ ఫోన్‌ ను రూ. 251కి అందిస్తామని ప్రకటించింది. గురువారం నుంచి ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో దీని అమ్మకాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నది.

అయితే ఈ కంపెనీ మీడియా కోసం విడుదల చేసిన శాంపిల్‌ యూనిట్‌ రివ్యూలో అనేక అంశాలు వెలుగుచూస్తున్నాయి. ప్రఖ్యాత యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్‌ డిజైన్‌ను 'ఫ్రీడం 251'లో పూర్తిగా కాపీచేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో యాపిల్‌ నుంచి దీనికి కాపీరైట్‌ సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తున్నది. బుధవారం సాయంత్రం విడుదలైన 'ఫ్రీడం 251' యూనిట్‌లో పలు సమస్యలు కూడా సమీక్షల్లో నిపుణులు గుర్తించారు. అయితే దీనిపై కంపెనీ ప్రతినిధులు మాత్రం ఇంతవరకు స్పందించలేదు.

'ఫ్రీడం 251'లో ఉన్న చాలావరకు బిల్ట్‌ ఇన్ యాప్స్.. ఐఫోన్‌ నుంచి నేరుగా కాపీ చేసినవి కావడం గమనార్హం. ఐఫోన్‌, ఐప్యాడ్, మ్యాక్‌ లలో కనిపించే సఫారీ వెబ్‌ బ్రౌజరే ఇందులోనూ కనిపిస్తున్నది. అంతేకాకుండా కంపెనీ వెబ్‌సైట్‌లో చూపించిన 'ఫ్రీడం 251' మోడల్‌ ఫొటోలకు, అది విడుదల చేసిన మొబైల్‌ఫోన్‌కు చాలా తేడాలు కనిపిస్తున్నాయి. 'ఫ్రీడం 251' పూర్తిగా ఐఫోన్‌ను పోలినట్టు కనిపించడమే కాకుండా.. ఐఫోన్ హోమ్‌ బటన్ తరహాలోనే దీనికి కూడా హోమ్‌ బటన్ రౌండ్‌గా కనిపిస్తున్నది.

మేడ్ ఇన్ ఇండియానా?
ఈ స్మార్ట్‌ఫోన్‌పైన 'ఫ్రీడం 251' అని పెద్దగా రాసి ఉన్నప్పటికీ.. దీని అసలు బ్రాండ్ నేమ్‌ 'యాడ్‌కామ్‌' అని తెలుస్తున్నది. ఒరిజినల్ బ్రాండ్ పేరును వైట్‌నర్‌తో చెరిపేసి.. 'ఫ్రీడం 251' అని రాసినట్టు కనిపిస్తున్నది. 'యాడ్‌కామ్‌' అనేది న్యూఢిల్లీకి చెందిన ఐటీ దిగమతుల కంపెనీ. ఈ కంపెనీకి చెందిన స్మార్ట్‌ఫోన్లు అమెజాన్, స్నాప్‌డీల్, గాడ్జెట్స్ 360 వంటి ఈ కామర్స్ వెబ్‌సైట్లలో సుమారు రూ. 4వేలకు లభిస్తున్నాయి.

ఇక 'ఫ్రీడం 251'లో స్వచ్ఛ భారత్, మహిళల భద్రత, యూట్యూబ్, వాట్సప్, ఫేస్‌బుక్ వంటి యాప్స్ ఉంటాయని అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నప్పటికీ.. ఈ మోడల్‌లో అలాంటి యాప్స్ ఏమీ లేకపోవడం గమనార్హం. అయితే మీడియాకు అవగాహన కోసం విడుదల చేసిన ఈ మోడల్ శాంపిల్ మాత్రమేనని, వినియోగదారులకు అమ్మబోయే 'ఫ్రీడం 251' మొబైల్ ఫోన్లలో తాము పేర్కొన్న అన్ని ఫీచర్స్, యాప్స్ ఉంటాయని రింగింగ్ బేల్స్ కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు చెప్పుకొచ్చారు.

Advertisement
 
Advertisement
 
Advertisement