
న్యూఢిల్లీ: ‘నిర్భయ’దోషుల ఉరి అమలును నిరవధిక వాయిదా వేస్తూ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు చెప్పిన తీర్పును కేంద్రం ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. అత్యవసరంగా విచారించాలంటూ శనివారం పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ ఈ పిటిషన్‌ను ఆదివారం విచారిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి నలుగురు దోషులకు, జైళ్ల శాఖ డీజీ, తీహార్‌జైలు అధికారులకు కూడా నోటీసులు పంపించారు. ఉరిని వాయిదా వేస్తున్నట్లు ట్రయల్‌కోర్టు శుక్రవారం తీర్పునివ్వగా, శనివారమే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ హైకోర్టును చేరింది.
ట్రయల్ కోర్టు తమ పరిధిని మించి తీర్పునిచ్చిందని పిటిషన్‌లో పేర్కొంది. కేంద్రం తరఫునవాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దోషులకు ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలు ఉపయోగించుకొనేందుకు తగిన సమయం ఇచ్చామని, అయితే వారు ఉద్దేశపూర్వకంగానే విచారణ ఆలస్యమయ్యేలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. ఇది న్యాయ వ్యవస్థను అవమానపర్చడమేనని పేర్కొన్నారు. దోషులకు ఉరి వాయిదా పడడంపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందిస్తూ.. దోషులకు మరణశిక్ష పడేవరకూ తన పోరాటం ఆగదని చెప్పారు.
తిరస్కరించిన రాష్ట్రపతి
‘నిర్భయ’కేసులో దోషి వినయ్‌కుమార్ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి కోవింద్ తిరస్కరించారు. ఇప్పటికే వినయ్ కుమార్ శర్మ, అక్షయ్‌ల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీకోర్టు కొట్టేసింది.