అధికారులకు కేంద్రమంత్రి వార్నింగ్‌

On Camera Renuka Singh Said Beat With Belt Threat For Officials - Sakshi

రాయ్‌పూర్‌:  కేంద్ర‌ గిరిజన శాఖ సహాయ మంత్రి క్వారంటైన్ కేంద్రంలో ప్రభుత్వ అధికారులను బెదిరిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. దిలీప్‌ గుప్తా అనే వ్యక్తి క్వారంటైన్‌ కేంద్రంలో వసతులు సరిగా లేవని ఫిర్యాదు చేశాడు. వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాడు. ఇది కాస్తా వైరల్‌గా మారడంతో కేంద్రమంత్రి రేణుకా సింగ్‌ ఆదివారం బల్రాంపూర్‌లో ఉన్న కరోనా క్వారంటైన్‌ కేంద్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో అక్కడి వసతుల గురించి ఆరా తీసిన రేణుకా సింగ్‌ .. ప్రభుత్వ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాగిరి తన దగ్గర చెల్లదని ఆమె‌ హెచ్చరించారు. (ఇంట్లోనే ఉంటున్నా)

‘మా ప్రభుత్వం అధికారంలో లేదని ఎవరు భావించవద్దు. మేం 15 సంవత్సరాలు పాలించాం. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం వద్ద చాలినంత డబ్బు ఉంది. కాబట్టి ప్రజలకు కావాల్సిన వాటిని సమకూర్చండి. కాషాయ కండువా ధరించిన బీజేపీ కార్యకర్తలు బలహీనులని భావించకండి. మాట వినని జనాలను గదిలో బంధించి బెల్టు తీసుకుని ఎలా కొట్టాలో నాకు బాగా తెలుసు జాగ్రత్త’ అంటూ ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు రేణుకా సింగ్‌. ఈ తతంగాన్ని దిలీప్‌ గుప్తా వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. రేణుకా సింగ్‌ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారానన్ని రేపుతున్నాయి. (‘అది మనిషి సృష్టించిన అతిపెద్ద విషాదం’)

ఈ క్రమంలో దిలీప్‌ గుప్తా మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితం నేను ఢిల్లీ వెళ్లి వచ్చాను. కరోనా నేపథ్యంలో బల్రాంపూర్‌ క్వారంటైన్‌ కేంద్రంలో ఉంటున్నాను. ఇక్కడ వసతులు సరిగా లేవు, మంచి ఆహారం పెట్టడం లేదు. దాంతో ఇక్కడి పరిస్థితిని వివరిస్తూ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాను. దీని గురించి అధికారులు నా మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. నా జుట్టు పట్టుకు లాగారు.. వీడియోను డిలీట్‌ చేశారు. కానీ ఈ లోపే రేణుకా సింగ్‌ ఈ వీడియోను చూడటంతో ఆమె క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చి మాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు’ అన్నాడు దిలీప్‌ గుప్తా.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top