ఫైజ్‌ కవిత వివాదంపై స్పందించిన జావెద్‌

Calling Faiz Poem Anti-National is Absurd, Says Javed Akhtar - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రఖ్యాత పాకిస్థానీ కవి ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ రాసిన ‘హమ్‌ దెఖేంగే’ కవితను ఐఐటీ కాన్పూర్‌లో ఆలాపించడం వివాదంగా మారింది. ఫైజ్‌ కవిత హిందూ వ్యతిరేకమైనదని, దీనిని పాడటం దేశద్రోహం అంటూ ఈ కవితను పాడిన విద్యార్థులకు వ్యతిరేకంగా కేసు నమోదైంది.  ఈ కేసు వివాదంపై ప్రఖ్యాత బాలీవుడ్‌ గీత రచయిత జావేద్‌ అఖ్తర్‌ స్పందించారు. ఫైజ్‌ కవితను హిందూ వ్యతిరేకమైనదని పేర్కొనడం అసంబద్ధం, హాస్యపూరితమని ఆయన కొట్టిపారేశారు.

ఇలాంటి వివాదాన్ని అసలు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరమే లేదన్నారు. అప్పటి పాకిస్థానీ పాలకుడు జియా ఉల్‌ హక్‌ ఛాందసవాద, మతతత్వ, ప్రగతినిరోధక పాలనకు వ్యతిరేకంగా ఫైజ్‌ ఈ కవిత రాశారని తెలిపారు. అవిభాజ్య భారతం నుంచి వచ్చిన ప్రగతిశీల రచయితల్లో ఫైజ్‌ ప్రముఖుడని పేర్కొన్నారు. భారత స్వాతంత్య్రం గురించి కవితలు రాసిన ఫైజ్‌.. ఆ తర్వాత చోటుచేసుకున్న దేశ విభజన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కవితలు రాశారని, దేశ విభజనను వ్యతిరేకించిన కవిని ఇప్పుడు దేశద్రోహి అని అభివర్ణించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఫైజ్‌ తన జీవితంలో సగభాగం పాక్‌ వెలుపలే గడిపాడని, అప్పట్లో పాక్‌ ద్రోహి అని కూడా అతనికి ముద్ర వేశారని గుర్తు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top