
ఉర్దూ అకాడమీ కార్యక్రమాన్ని రద్దు చేసిన బెంగాల్ ప్రభుత్వం
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ కోల్‌కతాలో నిర్వహించాలనుకున్న ఉర్దూ అకాడమీ కార్యక్రమాన్ని మమతా బెనర్జీ ప్రభుత్వం వాయిదా వేసింది. కార్యక్రమానికి ప్రముఖ గేయ రచయిత, కవి జావేద్ అక్తర్‌ను ఆహ్వానించడాన్ని ఇస్లామిక్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది. ‘హిందీ సినిమాలో ఉర్దూ’పేరుతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కోల్‌కతాలో ఈ కార్యక్రమం జరగనుంది.
చర్చలు, కవితా పఠనాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో భారతీయ సినిమాకు ఉర్దూ అందించిన గొప్ప సహకారాన్ని సెలబ్రేట్ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అయితే.. సోమవారం జరగాల్సిన ముషాయిరాకు ప్రముఖ రచయిత, కవి జావేద్ అక్తర్ అధ్యక్షత వహించాల్సి ఉంది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం కూడా అందింది.
ఈ ఆహ్వానంపై కోల్‌కతాలోని రెండు ప్రముఖ ఇస్లామిక్ సంస్థలు, జమియత్ ఉలేమా–ఎ–హింద్, వహ్యాహిన్ ఫౌండేషన్ అభ్యంతరం వ్యక్తం చేశాయి. మతం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తిగా అక్తర్‌ను అభివరి్ణంచాయి. ఆహ్వానాన్ని ఉపసంహరించుకోకపోతే 2007లో తస్లీమా నస్రీన్‌పై జరిగినట్లుగా ప్రజాస్వామ్య నిరసనలు ఉంటాయని జమియత్ ఉలేమా–ఎ–హింద్ కూడా హెచ్చరించింది.
దీంతో అనివార్య పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అకాడమీ చెప్పినప్పటికీ, మమతా బానర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంవత్సరానికి ముందు ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని, ఘర్షణకు బదులుగా వాయిదా వేయాలని నిర్ణయించుకుందని సమాచారం. అనివార్య పరిస్థితులు నాలుగు రోజుల కార్యక్రమాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని పశ్చిమ బెంగాల్ ఉర్దూ అకాడమీ కార్యదర్శి నుజ్రత్ జైనాబ్ తెలిపారు.
కార్యక్రమం రద్దు చేయడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ లౌకిక దేశమని, స్వేచ్ఛగా జీవించే, మాట్లాడే హక్కు నాస్తికులకు ఉందని మానవ హక్కుల కార్యకర్త షబ్నం హష్మి అన్నారు. అంతేకాదు.. మతాలు నడిచే రాష్ట్రాల్లో కూడా మతాన్ని నమ్మని వ్యక్తులు ఉన్నారని హష్మీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని రద్దు చేయడాన్ని కవి–రచయిత గౌహర్ రజా తీవ్రంగా విమర్శించారు.
‘హిందూ అయినా, ముస్లిం అయినా, ఛాందసవాదులు హేతుబద్ధ గళాలను నొక్కేయాలని చూస్తున్నారనడానికి ఇది నిదర్శనం’అని రజా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. సీపీఎం నేతలు సైతం దీన్ని ఖండించారు. ‘కోల్‌కతా జమైతియాలు జావేద్ అక్తర్ గురించే కలత చెందితే, సాహిర్ లూధియాన్వితో ఏమి చేసేవారు? మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని అతన్ని చంపేవారా?’అని ప్రశ్నించారు. అంతేకాదు.. బెంగాల్ ఉర్దూ అకాడమీ పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడుస్తోందని, జమియత్ ముల్లాల వ్యక్తిగత ఆస్తి కాదని స్పష్టంచేశారు.