‘ఓట్‌ చోర్‌..’ దీదీ ఘాటు వ్యాఖ్యలతో రణరంగంగా బెంగాల్‌ అసెంబ్లీ | Mamata Banerjee Vote Chore Speech WB Assembly Rucks Updates | Sakshi
Sakshi News home page

‘ఓట్‌ చోర్‌..’ దీదీ ఘాటు వ్యాఖ్యలతో రణరంగంగా బెంగాల్‌ అసెంబ్లీ

Sep 4 2025 4:37 PM | Updated on Sep 4 2025 5:15 PM

Mamata Banerjee Vote Chore Speech WB Assembly Rucks Updates

బీజేపీ ఎమ్మెల్యేల జై శ్రీరాం నినాదాలతో, అరుపులతో, ఈడ్చివేతలతో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ప్రతిపక్షంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేయగా.. అడ్డుకునేందుకు వాళ్లు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పడంతో మార్షల్స్‌ సాయంతో బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్‌ బయటకు పంపించేశారు. 

బీజేపీపై మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు.. ప్రతిపక్ష బీజేపీ ఆందోళనలతో బెంగాల్అసెంబ్లీ గురువారం అట్టుడికిపోయింది.  ఇతర రాష్ట్రాల్లో బెంగాలీ వలస కూలీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీఎంసీ ప్రభుత్వం ఓ తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ తీర్మానంపై ప్రసంగిస్తూ.. సీఎం మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. 

బీజేపీని బెంగాల్వ్యతిరేక పార్టీగా అభివర్ణించిన ఆమె.. ఓట్ల చోరీతో అతిపెద్ద దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. పార్లమెంట్లోనూ టీఎంసీ ఎంపీలను సీఐఎస్ఎఫ్బలగాలను ఉపయోగించి విధంగా వేధించారో అంతా చూశారని అన్నారామె.  బెంగాలీలను మోదీ, అమిత్‌ షాలు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారామె. 

‘‘బీజేపీ అవినీతి పార్టీ. ఓట్ల దొంగ. అతిపెద్ద దోపిడీ పార్టీ. బీజేపీ నుంచి బెంగాల్‌ను, దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె ప్రసంగించారు. ఆ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు ‘‘జై శ్రీరాం’’ నినాదాలతో ఆమె ప్రసంగానికి అడ్డు తగిలారు. దీంతో ఆమె మరింత స్వరం పెంచారు. 

‘‘రాసిపెట్టుకోండి. బెంగాల్‌ అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా పోతాడు. మీరు చేసే రాజకీయాలకు.. అధికార పీఠం నుంచి ప్రజలు మిమ్మల్ని దించేస్తారు. మోదీ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం’’ అని అన్నారామె.

బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన అన్‌పార్లమెంటరీగా ఉందన్న ఆమె.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే బెంగాలీలపై దాడులు జరుగుతున్నందున అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ తరుణంలో.. బీజేపీ సభ్యులు మరింతగా ఊగిపోయారు. టీఎంసీ సభ్యులతో వాగ్వాదానికి దిగడంతో ఒకరినొకరు తోసేసుకున్నారు. దీంతో..  చీఫ్‌ విప్‌ డాక్టర్‌ శంకర్‌ ఘోష్‌  సహా బీజేపీ ఎమ్మెల్యేలను ఇవాళ్టి సెషన్‌ నుంచి స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు. అయితే.. 

ఆయన బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్‌ సాయంతో బయటకు బలవంతంగా పంపించేశారు. ఈ క్రమంలో ఆయన స్పృహ కోల్పోవడంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. ఈ పరిణామంతో ప్రతిపక్ష నేత సువేందు అధికారి హుటాహుటిన అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. టీఎంసీ కేడర్‌ను గూండాలుగా అభివర్ణించారు. టీఎంసీ గూండాలు శంకర్‌ ఘోష్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారని ఆరోపించారాయాన. మమతా బెనర్జీనే అతిపెద్ద దొంగ అని అన్నారు. ఇదిలా ఉంటే.. బెంగాల్‌ అసెంబ్లీ స్పెషల్‌ సెషన్‌ కార్యకలాపాలకు అడ్డుతగిలారని సువేందు అధికారిని ఇదివరకే సభ నుంచి సస్పెండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement