తస్లీమా నస్రీన్ ఆవేదన
న్యూఢిల్లీ: ప్రముఖ కవి, రచయిత జావేద్ అక్తర్‌ను బెంగాల్ ఇస్లాం మత ఛాందసవాదులు వ్యతిరేకించడంపై బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. ఒకప్పుడు ముంబైలో సంప్రదాయ వాదులు తనపై బెదిరింపులకు పాల్పడితే.. జావేద్ అక్తర్ అండగా నిలిచారని, ఇప్పుడు బెంగాల్‌లో ఇస్లాం గ్రూపులు జావేద్‌ను వ్యతిరేకిస్తుంటే ఆయనకు మద్దతుగా నిలిచి ఛాందసవాదులను ఓడించడానికి మరో జావేద్ లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం నిలబడిన వ్యక్తికి ఇప్పుడు మద్దతుగా నిలబడటానికి ఎవ్వరూ లేకపోవడం విషాదమన్నారు. మరాఠీలోకి అనువదించిన ఆమె పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ముంబైలో 2000లో తస్లీమా హాజరు కావాల్సి ఉంది. ఆ సమయంలో ముంబైలోని ముస్లిం ఛాందసవాదులు ఆమె నగరంలో అడుగు పెడితే విమానాశ్రయాన్ని తగలబెడతామని ప్రకటించారు. ఇబ్బందులను నివారించేందుకు ఆమె ముంబై ప్రయాణాన్ని విరమించుకున్నారు.
కానీ, జావేద్ అక్తర్ ఆమెకు అండగా నిలిచారు. కార్యక్రమానికి రావాలని కోరారు. అంతేకాదు, షబానా అజ్మీ, మహే‹ష్ భట్, మరాఠీ ప్రచురణకర్త అశోక్ సహానీతో కలిసి ఆమెను స్వాగతించడానికి విమానాశ్రయానికి కూడా వెళ్లారు. ‘నాకు భారీ భద్రత ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని కోరింది ఆయనే.
ఆ రోజు సెక్షన్ 144 అమలులో ఉంది. విధ్వంసం సృష్టించడానికి ప్రయతి్నంచిన ఛాందసవాదులను అరెస్టు చేశారు’అని ఆమె గుర్తు చేసుకున్నారు. కానీ ఈరోజు కోల్‌కతాలో భావ ప్రకటన స్వేచ్ఛ, లౌకికవాదం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడం తనను బాధించిందన్నారు. తనను కోల్‌కతా నుంచి బలవంతంగా బయటికి పంపినప్పుడు మౌనంగా ఉన్నట్టే ఇప్పుడూ ఉన్నారని తస్లీమా అసహనం వ్యక్తం చేశారు.