breaking news
Bangladeshi writer
-
రచయితలపై తస్లీమా ఫైర్
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని నిరసన వ్యక్తం చేస్తూ సాహిత్య అకాడమీ అవార్డులు తిరిగి ఇచ్చేసిన రచయితల సంఖ్య 30కి చేరింది. ఒకవైపు రచయితలు వరుసపెట్టి తమ పురస్కారాలను వాపస్ ఇస్తుండగా.. మరోవైపు ప్రభుత్వం వారి నిరసన కల్పితమైనదని కొట్టిపారేసింది. ఈ వివాదంపై తాజాగా భారత్‌లో ప్రవాసముంటున్న బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా స్పందించారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారతీయ రచయితలు ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఆమె విమర్శించారు. తనపై దాడి జరిగినప్పుడు వారు ఎందుకు మౌనంగా ఉండిపోయారని ప్రశ్నించారు. అవార్డులను తిరిగి ఇవ్వడం ద్వారా అన్యాయాలపై నిరసన తెలియజేయడం తప్పేమీ కాదన్నారు. ఇది కల్పిత నిరసన అని ప్రభుత్వం చేస్తున్న వాదనతో తాను ఏకీభవించడం లేదని, రచయితలు రాజకీయంగా, సామాజికంగా స్పృహ కలిగిన వ్యక్తులని పేర్కొన్నారు. 'నా పుస్తకం పశ్చిమ బెంగాల్లో నిషేధించినప్పుడు, నాపై భారత్‌లో ఐదు ఫత్వాలు జారీచేసినప్పుడు, బెంగాల్ నుంచి నన్ను వెళ్లగొట్టినప్పుడు, ఢిల్లీలో నెలపాటు నన్ను గృహనిర్బంధంలో ఉంచినప్పుడు చాలామంది రచయితలు మౌనంగా ఉండిపోయారు. ఇక్కడ జీవించడానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం నేను ఒంటరిగానే పోరాడుతున్నాను. ఈ విషయంలో రచయితలు మౌనంగా ఉండటమే కాకుండా.. సునీల్ గంగూలీ, శంఖా ఘోష్ వంటి రచయితలు నా పుస్తకాన్ని నిషేధించాలని అప్పటి సీఎం బుద్ధదేవ్ భట్టచార్యకు కోరారు కూడా' అని తస్లీమా పేర్కొన్నారు. అసమ్మతి తెలియజేయడంలోనూ భారత రచయితలవి ద్వంద్వ ప్రమాణాలని విమర్శించారు. ఇక్కడ లౌకికవాదమూ సమస్యే! భారత్‌లో లౌకికవాదం అనుసరించే విధానంలోనూ సమస్య ఉందని, చాలామంది లౌకికవాదులు ముస్లింలకు అనుకూలంగా, హిందూ వ్యతిరేకులుగా వ్యవహరిస్తున్నారని తస్లీమా పేర్కొన్నారు. వారు హిందూ ఛాందసవాదుల చర్యలను నిరసిస్తారు.. అదేసమయంలో ముస్లిం ఛాందసవాదుల దారుణమైన చర్యలను సమర్థిస్తారని తెలిపారు. -
రచయిత్రి తస్లీమా నస్రీన్ పై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో/కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. తమ మత విశ్వాసాలను కించపరిచేలా తస్లీమా ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ మత గురువు హసన్ రజా ఖాన్ నూరి మియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన తస్లీమా ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. మత గురువులపై ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని హసన్ రజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తస్లీమా పాస్‌పోర్టును వెంటనే స్వాధీనం చేసుకుని, ఆమెను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తనపై ఎఫ్ఐఆర్ నమోదయినట్టు తెలియడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తస్లీమా అన్నారు. తాను వాస్తవాలనే చెప్పానని ఆమె పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటో అర్థం కావడం లేదని, సత్యం మాట్లాడినందుకు మరోసారి తనకు ఇబ్బందులు తప్పడం లేదని ఢిల్లీలో మీడియాతో అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ ఉన్న ప్రజాస్వామిక భారత దేశంలో ఇలాంటిది జరుగుతుందని అనుకోలేదని అన్నారు. గతంలో ఛాందసవాదులనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆమెను అధికారులు కోల్‌కతానుంచి ఢిల్లీకి పంపించిన విషయం తెలిసిందే.